Site icon vidhaatha

Posani Krishna Murali | నన్ను చంపేందుకు చంద్రబాబు కుట్ర.. పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణ

PPosani Krishna Murali |

విధాత: తనను హత్య చేయడానికి చంద్రబాబు, లోకేశ్ కుట్ర పన్నారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారని వాపోయారు.

కంతేరులో లోకేశ్ 14 ఎకరాల భూములు కొన్నారని తాను అన్నానని, దీనిమీద లోకేశ్ పరువు నష్టం దావా వేశారని అన్నారు. అల్‌ ఖైదా పేరు చెబితే బిన్ లాడెన్ గుర్తుకు వచ్చినట్టు, హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకు రాడా? హెరిటేజ్ ఆస్తులు నీవి కావా? అన్నారు పోసాని.

హెరిటేజ్ పేరుతో భూములు కొన్నమాట నిజం‌కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన లోకేశ్ పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అన్నారు. రామోజీరావుని బ్రోకర్ అనే అన్నానని చెబుతూ చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ కూర్చుని గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని వస్తుందని ఆరు నెలల ముందే నిర్ణయించారని అన్నారు.

రాజధాని భూముల్లో త్యాగాలు లేవు.. అంతా వ్యాపారాలే ఉన్నాయని, గన్నవరంలో భూములు పోతే రాజధాని ప్రాంతంలో అశ్వనీదత్ కి ఎందుకు భూములిచ్చారని పోసాని నిలదీశారు. ఇక పరువు నష్టం దావా వ్యవహారంలో తనను మంగళగిరికి పిలిపించుకుని, కోర్టు చుట్టూ తిప్పాలని, ఆ సమయంలో తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని ఆరోపించారు.

నారా లోకేశ్ అంటే ఎవరో అనుకోవద్దని స్పష్టం చేశారు. “నారా లోకేష్ అంటే చాలామంది ఉంటారు.. ఎవరో అనుకోవద్దు! చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త.. అతనే నా చావుకు కారణమౌతాడు” అని పోసాని ఆరోపించారు.

Exit mobile version