Site icon vidhaatha

వరంగల్ పశ్చిమలో పోటీ చేస్తున్నా.. నాయిని రాజేందర్‌రెడ్డి సెల్ఫ్ డిక్లరేషన్

అసలే అది కాంగ్రెస్ పార్టీ (congress party)ఎప్పుడు ఏదైనా జరగవచ్చూ. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ వస్తుందో? ఎవరు పోటీ చేస్తారో? సీనియర్ నేతలకే గ్యారెంటీ ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో ఏడాది ముందుగానే ఈసారి ఎన్నికల్లో తాను తప్పకుండా కాంటెస్ట్ (contest) చేస్తానంటూ.. నమ్ముకున్న కేడర్‌కు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత గానీ.. ఇప్పుడైతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని తన మనసులోని మాట వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో బహిరంగ ప్రకటన చేసి హమ్మయ్య …ఒక పెద్ద బరువు దించుకున్నట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసక్తికర సంఘటన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్సేహాత్ జోడో యాత్ర సందర్భంగా హనుమకొండ అమృత సెంటర్లో సోమవారం రాత్రి జరిగింది. కార్నర్ మీటింగ్‌కు (corner meeting) అధ్యక్షత వహించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో తాను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా కచ్చితంగా కాంటెస్ట్ చేస్తానని.. ఈ సభ వేదిక సాక్షిగా మీకు భరోసా ఇస్తున్నానని (Nayini RajenderReddy) నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికి ముందు ఆయన మాట్లాడుతూ.. అన్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా నెత్తిన రుద్దకండి. ఈ బరువును తట్టుకోలేక పోతున్నాం. పార్టీ కోసం రక్త మోడుస్తున్నాం. కేసులు (cases) భరిస్తున్నాం. వేధింపులు తట్టుకొని పార్టీ కోసం నిలబడిన మమ్మల్ని తీరా ఎన్నికల సమయంలో వచ్చేసరికి విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే మీ సమక్షంలో మా కార్యకర్తలకు మాటిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో నేను కాంటెస్ట్ చేస్తానని భరోసా ఇస్తున్నానని ప్రకటించారు. నాకంటే మంచి అభ్యర్థి ఉంటే నాకు అభ్యంతరం లేదు కానీ, ఎక్కడెక్కడ నుంచో పనికిరాని వాళ్లను (out siders)పొరుగు జిల్లాల వాళ్ళను, ఇక్కడి వాళ్లను, పార్టీ కోసం పని చేయని వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తే మా కడుపుకోత చెప్పుకోలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యకర్తల కడుపుకోతను తుడిచే నాయకుడు కావాలని అన్నారు. దయచేసి ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తానని నాయిని రాజేందర్ రెడ్డి మరోసారి ప్రకటించారు. రెండు పర్యాయాలు పోటీకి అవకాశం వచ్చినట్లు వచ్చి చేజారి పోయిన నాయిని ఈసారి ముందు జాగ్రత్త వహించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రేవంత్ ప్రసంగంలో తిరిగి ప్రస్తావన

రాజేందర్ రెడ్డి ప్రకటన కాస్తంత కలవరం సృష్టించినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఈ విషయాన్ని మరోసారి మాట్లాడుతూ తాను కార్యకర్తల నాయకున్ని… జెండాలు మోసిన వాళ్లని గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. రాజేందర్ రెడ్డి లాంటి వాళ్లకు న్యాయం చేసేందుకు హనుమంతన్నలాంటి వాళ్లు బాధ్యత తీసుకొవాలన్నారు.

సోనియాగాంధీ(Soniya)ని ఒప్పించాలని ఈ వ్యవహారం ఆయనకు రేవంత్ రెడ్డి అప్పగించారు. తాను సహకరిస్తానని హామీ ఇస్తూ… ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో గానీ ఆ క్షణానికైతే తాను బాధ్యత మీద వేసుకోకుండా రేవంత్ రెడ్డి మాత్రం పెద్దమనిషికి అప్పగించి తప్పుకున్నారు.

Exit mobile version