ఎట్టకేలకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు టీటీడీ నిర్ణయం

  • Publish Date - November 14, 2023 / 01:58 PM IST

  • కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ బోర్డు

విధాత : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ జీవో నెంబర్‌ 114 మేరకు ఎంత మందికి అవకాశం ఉంటే అంత మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. తిరుమల ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న 650 మంది ఉద్యోగులను మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించింది. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద ఈనెల 23 నుంచి ప్రారంభిస్తున్నామని బోర్డు వెల్లడించింది. హోమంలో పాల్గొనే భక్తులు రూ.1000 చెల్లించి టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుందని టీటీడీ ఛైర్మన్‌ రుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసాదాలు, ముడి సరుకులు నిల్వ కోసం రూ. 11 కోట్లతో అలిపిరి వద్ద గౌడన్ల నిర్మాణం, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంటి స్థలాలు కేటాయింపు చేస్తామని తెలిపారు.


ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాలపేట వద్ద గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ. 25.67 కోట్లు కేటాయించామని తెలిపారు. వీటిని తిరిగి ఉద్యోగుల నుంచి రీఎంబర్స్ చేసుకుంటామన్నారు. తిరుపతిలోని రాంనగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు 6.15 కోట్లు కేటాయించామన్నారు. ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 6,850 చెల్లిస్తామని భూమన వివరించారు. రూ. 197 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి ఆధునీకరణ పనులకు ఆమోదం తెలిపామన్నారు. మంగళం నుంచి రేణిగుంట వరకు రోడ్డు అభివృద్ది పనులుకు 15 కోట్లు, ఎంఆర్ పల్లి జంక్షన్ నుంచి అన్నమయ్య వరకు రూ. 4.5 కోట్లు, పుదిపట్ల జంక్షన్ నుంచి వకులామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ. 21 కోట్లు కేటాయించామన్నారు. ఆయుర్వేద ఆస్పత్రి కోసం రూ.1.65 కోట్లతో కొత్త భవన నిర్మాణం, ఇదే సమయంలో రుయాలో టీబీ రోగుల సౌకర్యార్థం రూ.1.79 కోట్లతో కొత్త వార్డు నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. స్విమ్స్ ఆస్పత్రికి సంబంధించి రూ.3.35 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామన్నారు. కొత్తగా కార్డియో, న్యూరో బ్లాక్ ల ఏర్పాటు కోసం రూ. 74 కోట్లు కేటాయించినట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి డీఎఫ్ఓ ఆధ్వర్యంలో కొత్త కెమెరాలు, బోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మించాలని నిర్ణయించింది. సాంప్రదాయ కళల అభివృద్ధికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని తీర్మానించింది. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

Latest News