Pregnancy Kit | కూతురుని ఉన్నత విద్యావంతురాలిగా చూడాలన్నదే తల్లిదండ్రుల లక్ష్యం. కానీ కూతురు ఆ లక్ష్యాన్ని వదిలేసి.. చెడు వ్యసనాల బాట పట్టింది. నిరంతరం అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండేది. ఇటీవలే ఆమె వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లభించింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తల్లిదండ్రులు.. కూతురును మట్టుబెట్టారు. ఆనవాళ్లు దొరకొద్దనే ఉద్దేశంతో యాసిడ్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కౌశంబి పరిధిలోని అలమాబాద్ గ్రామానికి చెందిన నరేశ్, శోభా దేవి దంపతులు తమ కుమార్తె(21) తో కలిసి నివాసముంటున్నారు. అయితే బిడ్డను గొప్పగా చదివించి, ప్రయోజకురాలిగా చేయాలని పేరెంట్స్ కలలు కన్నారు. అందుకోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కానీ కూతురేమో.. తల్లిదండ్రుల మాటలను పెడ చెవిన పెట్టింది. అబ్బాయిలతో నిరంతరం ఫోన్లో మాట్లాడుతూ.. సమయాన్ని వృథా చేస్తుంది. ఆమె ప్రవర్తన తల్లిదండ్రులకు ఏమాత్రం నచ్చలేదు. ఇటీవలే ఆమె వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లభ్యమైంది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన నరేశ్, శోభాదేవి కలిసి కూతురిని చంపేశారు. బిడ్డ ఆనవాళ్లు దొరకొద్దనే ఉద్దేశంతో ఆమెపై యాసిడ్ పోశారు. ఇందుకు నరేశ్ సోదరులు గులాబ్, రమేశ్ సహకరించారు.
కూతురు అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు
ఇక తనకేమి తెలియనట్లు కూతురు అదృశ్యంపై ఫిబ్రవరి 3వ తదీన పోలీసులకు నరేశ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి కొంచెం దూరంలో ఉన్న ఓ కెనాల్ వద్ద యువతి మృతదేహం లభ్యమైంది. యాసిడ్ పోసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. నరేశ్, శోభాదేవిని తమదైన శైలిలో విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించారు. నరేశ్, శోభాదేవి, గులాబ్, రమేశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.