COVID-19 Mock Drill | దేశంలో కోవిడ్ -19 మరియు సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా కేసులు మరోసారి పెరగడం ప్రారంభించాయి. ఇదిలా ఉండగా, ఆసుపత్రుల సన్నద్ధతను పరిశీలించేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 10 మరియు 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ సలహా జారీ చేసింది. ఈ మాక్‌డ్రిల్‌లో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఆరోగ్య విభాగాలు పాల్గొంటాయని తెలిపింది. మార్చి 27న జరిగే వర్చువల్ మీటింగ్‌లో మాక్ డ్రిల్‌కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను రాష్ట్రాలకు తెలియజేస్తామని కూడా అడ్వైజరీ పేర్కొంది.
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. పలు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ రాజీవ్ బెహ్ల్ అడ్వైజరీలో తెలిపారు. అత్యధిక కరోనా కేసులు కేరళ (26.4 శాతం), మహారాష్ట్ర (21.7 శాతం), గుజరాత్ (13.9 శాతం), కర్ణాటక (8.6 శాతం), తమిళనాడు ( 6.3 శాతం) నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే పరీక్ష స్థాయి సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ కొవిడ్ పరీక్షలను పెంచాలని, లక్షణాలకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకొని.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు తప్పనిసరిగా మాక్‌డ్రిల్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఐసీయూలో బెడ్లు, వైద్య పరికరాలు, ఆక్సిజన్, సిబ్బంది తదితర విషయాలపై అంచనా వేయనున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు ప్రజలంతా కొవిడ్ నియమాలు పాటించాలని ఐసీఎంఆర్, ఆరోగ్యశాఖ సంయుక్త అడ్వైజరీలో కోరింది. దాంతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించింది. తరుచూ చేతులను కడుగుతూ ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వంటి చేయొద్దని సూచించింది. ఇదిలా ఉండగా.. దాదాపు 146 రోజుల తర్వాత దేశంలో శనివారం 1590 కేసులు నమోదైన విషయం తెలిసిందే.