Site icon vidhaatha

CPI | విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి.. ఓట్లడిగే హక్కు లేదు: సీపీఐ పోరు యాత్ర ప్రారంభం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విభజన హామీలను అమలు చేయని బీజేపీకి తెలంగాణా రాష్ట్రంలో ఓట్లడిగే హక్కు లేదని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో విభజన హామీల సాధన కోసం సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్రను కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బి. విజయ సారథి అద్యక్షతన జరిగిన ప్రారంభసభలో కూనంనేని మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పట్ల వివక్ష చూపుతున్నదని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచినా విభజన హామీలను అమలు చేయలేదని సాంబశివరావు అన్నారు. అందుకే సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్రను ప్రారంభించామని, విభజన హామీల సాధన కోసం సీఎం కేసీఆర్ విపక్షాలను కలుపుకుని పార్లమెంటు ఎదుట ధర్నా చేయాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ అరడజను దొంగల కోసం దేశాన్ని దోచి పెడుతున్నదని, వారిని సాగనంపాలని, వంద సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన సీపీఐ పోరాడుతున్నదని అన్నారు.

2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ సందర్బంగా పార్ల మెంటులో చట్టం చేసిన చట్టం ప్రకారం విభజన హామీలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటి ఏర్పాటు చేయవల్సి ఉన్నా కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాలు అయినా ఏర్పాటు చేయకుండా దేశాన్ని కార్పోరేట్లు మోడీలు నీరవ్ మోడీ, అదానీ ఇతర ఆరుగురి దోచి పెడుతున్నదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నారని, ఈ విషయాలను ప్రజలలో తీసుక వెల్లేందుకు సీపీఐ పోరు యాత్ర తల పెట్టిందని అన్నారు. బయ్యారం ఉక్కును అక్రమంగా రక్షణ స్టీల్‌కు లక్షల టన్నుల తరలించడాన్ని 2010 సంవత్సరంలో అడ్డుకొని అసెంబ్లీ దీనిపై అప్పటి ప్రభుత్వానికి తెలియచేసి ఆపడం జరిగిందని, సీపీఐకి మాత్రమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అడిగే హక్కు ఉందని అన్నారు.

దేశంలో ప్రతి పక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహూల్ గాంధీ పై మోడీ పేరు మీద విమర్శలు చేశారని, 2019లో బీజేపీ నాయకులు సూరత్ కోర్టులో కేసు వేశారని, ఇప్పుడు పార్లమెంటు సభ్యత్వానికి రాహుల్‌ను అనర్హుడిని చేశారని కేంద్రంపై, బీజేపీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు.

12 సెగ్మెంట్‌లలో పోరుయాత్త

ఈ నెల 25 నుండి ఆరు జిల్లాల మీదుగా ఏప్రిల్ 5 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాల అయిన ములుగు, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, వరంగల్, భూపాలపల్లి మీదుగా యాత్ర కొనసాగుతుందని, ప్రజలు ప్రజాస్వామిక వాదులు పోరు యాత్రను జయప్రదం చేయాలని ప్రజా పోరు యాత్ర కన్వీనర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున రావు, రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మండ సదాలక్ష్మి, నాయకులు పంజాల రమేష్, బి. అజయ్,షేక్ బాష్ మియా, నల్లు సుధాకర్ రెడ్డి,పాతూరి సుగుణ,ఆదరి శ్రీనివాస్, మాగం లోకేష్, ఏపూరి భ్రహ్మం, అజయ్ సారధి, కట్టె బోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version