విధాత: ప్రజల యొక్క విలువైన ప్రాణాలను కాపాడటమే సీపీఆర్ లక్ష్యం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ప్రజలు లైఫ్ స్టైల్ మారిపోయింది అని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు అలవాటు పడటంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారాయన్నారు. పని ఒత్తిడి కారణంగా షాక్స్ వస్తున్నాయి. కరోనా తర్వాత కూడా కార్డియాక్ అరెస్టులు పెరిగాయి అని హరీశ్‌రావు తెలిపారు. వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు సిబ్బందికి సీపీఆర్ శిక్షణను మేడ్చల్ జిల్లాలో హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
మన దేశంలో ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారు అని హరీశ్‌రావు తెలిపారు. ప్రతి రోజు 4 వేల మంది చనిపోతున్నారని గుర్తు చేశారు. అయితే సడెన్ కార్డియాక్ అరెస్టు ద్వారా చనిపోతున్న వారి సంఖ్యను సీపీఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకోవచ్చు అని మంత్రి సూచించారు.
ఎవరో ఒకరు మాత్రమే సీపీఆర్‌పై అవగాహన ఉండి చేయడం వల్ల ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడుతున్నారని తెలిపారు. కానీ సీపీఆర్ ప్రక్రియను విజయవంతం చేయగలిగితే 10 మందిలో ఐదుగురిని బతికించుకోవచ్చని డబ్ల్యూహెచ్‌వోతో పాటు పలు ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సడెన్ కార్డియాక్ అరెస్టు వల్ల తెలంగాణలో ఏడాదికి 24 వేల మంది చనిపోతున్నారని హరీశ్‌రావు తెలిపారు. సీపీఆర్ శిక్షణను విజయవంతం చేయగలిగితే ఇందులో సగం మందిని కాపాడుకోవచ్చన్నారు. సీపీఆర్ ప్రక్రియకు కేవలం అవగాహన మాత్రమే అవసరం అన్నారు. ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయడం వల్ల రోగాలను దూరం చేసుకోవచ్చు. ప్రజలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్య రక్షణ కోసం లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలి. సీపీఆర్ ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పిస్తాం. సీపీఆర్‌ను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల వరకు తీసుకెళ్లేందుకు వైద్యారోగ్య శాఖ కృషి చేస్తోంది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.