Site icon vidhaatha

Crop Damage: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన.. పంట నష్టం.. ఆదుకుంటామ‌ని మంత్రి హామీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మానుకోట జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతులను నట్టేట ముంచింది. మరిపెడ, కురవి, దంతాలపల్లి మండలాల్లో మామిడి తోటలు, వరి పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాయ తెంపే దశకు వచ్చిన మామిడి తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. తోటలు నమ్ముకున్న రైతులు లబోదిబోమంటున్నారు.

జనగామ జిల్లా జనగామ, దేవరుప్పుల, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాలలో వడగండ్ల వానతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి పొలాల్లో ధాన్యం రాలి నేల వాలింది. ఇది ఇలా ఉండగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి నీటిపాలయ్యింది. పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.

వ‌డ‌గండ్ల బాధితుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది: మంత్రి ఎర్ర‌బెల్లి

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాతోపాటు, జ‌న‌గామ జిల్లాలో కురిసిన వ‌డ‌గండ్ల వాన‌కు జ‌రిగిన భారీ న‌ష్టాల‌ను వెంట‌నే రంగంలోకి దిగి అంచ‌నా వేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ శాఖ‌మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను, సంబంధిత శాఖ‌ల అధికారులను ఆదేశించారు. ఈ మేర‌కు మంత్రి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలోని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఏయే చోట్ల వ‌డ‌గండ్లు కురిసాయి? ఏ మేర‌కు ఏయే పంట‌లు న‌ష్టాల‌కు గుర‌య్యాయి. ఎంత మంది రైతులు న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది? పంట న‌ష్టాలు ఎన్ని ఎక‌రాల్లో? ఎంత మేర‌కు న‌ష్ట‌పోయాయ‌నే విష‌యాల‌పై మంత్రి జిల్లాల క‌లెక్ట‌ర్లు, వ్య‌వ‌సాయ అధికారుల‌తో మాట్లాడి ఆరా తీశారు.

శ‌నివారం సాయంత్రం భారీగా గాలులు వీస్తూ కురిసిన వ‌డ‌గండ్ల వాన రైతాంగానికి తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించింద‌ని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వ‌డ‌గండ్ల వానల‌కు న‌ష్ట‌పోయిన రైతాంగం ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. సిఎం కెసిఆర్ తో మాట్లాడాన‌ని, పంట న‌ష్టాల అంచ‌నాలు వేశాక‌, త‌గిన విధంగా ప‌రిహారం అందేలా చూస్తామ‌ని మంత్రి తెలిపారు.

Exit mobile version