Site icon vidhaatha

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌!


న్యూఢిల్లీ : ఎన్నిక ఏదైనా అనైతిక పద్ధతుల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ.. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లోనూ అదే వాటిని నిజం చేసిందా? లోక్‌సభ ఎన్నికలకు కొద్దివారాల ముందు మంగళవారం నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన తంతు గమనిస్తే అవుననే అనిపిస్తున్నది. ఇటీవల చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు మార్గంలో గెలిచినా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. తప్పును సరిచేసిన విషయం తెలిసిందే.


తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూపీ, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. మంగళవారం ఉదయం నుంచి జరిగిన పోలింగ్‌ అనంతరం సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో కర్ణాటకలోని నాలుగు స్థానాలకుగాను కాంగ్రెస్‌ 3, బీజేపీ ఒక స్థానం కైవసం చేసుకున్నాయి.


జేడీఎస్‌ తరఫున ఐదో అభ్యర్థిగా ఉన్న డీ కుపేంద్రరెడ్డి 36 ఓట్లు మాత్రమే తెచ్చుకుని ఓడిపోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన ఒక్క స్థానాన్ని బీజేపీ చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్విపై బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌ గెలిచారు. ఇద్దరు అభ్యర్థులకూ చెరొక 34 ఓట్లు రావడంతో టాస్‌ వేశారు. ఇందులో ఫలితం హర్ష్‌ మహాజన్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో ఆయన ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇక యూపీలో


హిమాచల్‌లో హైడ్రామా


కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు సందర్భంగా హైడ్రామా చోటు చేసుకున్నది. దీంతో కొద్దిసేపు ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఐదారుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హర్యానా పోలీసులు పంచకుల తీసుకుపోయారని ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ సుఖు ఆరోపించారు. ఇక్కడ ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. కనీసం 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తున్నది.


కాగా.. వారిలో సుధీర్ శర్మ, రాజేందర్ రాణా, దేవేందర్ భుట్టో, రవి ఠాకూర్, చైతన్య శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, ఆశిష్ శర్మ (స్వతంత్ర), కెఎల్ ఠాకూర్ (స్వతంత్ర) ఉన్నట్టు చెబుతున్నారు. తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు కోల్పోయిందని, మళ్లీ సభలో విశ్వాసం పొందాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే.. కాంగ్రెస్‌ నేతలు మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. అయితే.. కాంగ్రెస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు తనతో ఎన్నికలకు ముందు నుంచే టచ్‌లో ఉన్నారని మహాజన్‌ చెప్పుకోవడం గమనార్హం.


రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ సరళి ఆధారంగా సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 60 మంది సభ్యులు ఉన్న హిమాచల్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ సమగ్రతను అమ్ముకున్నారని ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఉత్తరప్రదేశ్‌లో బాహాటంగానే


ఉత్తరప్రదేశ్‌లోనూ భారీగానే ప్రలోభాల పర్వం నడిచింది. సమాజ్‌వాది పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బాహాటంగానే బీజేపీకి మద్దతు పలికారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ విప్‌గా ఉన్న మనోజ్‌ పాండే తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశారు. రాకేశ్‌ పాండే, అభయ్‌ సింగ్‌, రాకేశ్‌ ప్రతాప్‌సింగ్‌, మనోజ్‌పాండే, వినోద్‌ చతుర్వేది, పూజాపాల్‌, అశుతోశ్‌ మౌర్య ఎన్డీయేకు మద్దతుగా ఓటేశారని చర్చ నడుస్తున్నది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేసినట్టు చెబుతున్నారు.


తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించడం ద్వారా బీజేపీ రాజకీయ బేరసారాలకు పాల్పడిందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ ఆరోపించారు. లాభాలు ఆశించినవారే తమ పార్టీ నుంచి వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం పది స్థానాలకు గాను బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను పోటీకి నిలుపగా, ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ ముగ్గురు అభ్యర్థులను దింపింది. వాస్తవానికి బీజేపీకి ఉన్న సంఖ్యాబలంతో ఏడు స్థానాలు, ఎస్పీకి ఉన్న ఎమ్మెల్యేలతో మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ.. బీజేపీ 8వ అభ్యర్థిని నిలుపడంతో పోటీ అనివార్యమైంది. ఆ సీటును గెలిపించుకునేందుకు భారీగా ప్రలోభాల పర్వానికి తెరలేపిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.


జయాబచ్చన్‌కు టికెట్‌తో


రాజ్యసభ అభ్యర్థుల విషయంలో అప్నాదళ్‌ (కే) నేత పల్లవి పటేల్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. ఇందులో జయాబచ్చన్‌కు టికెట్ ఇవ్వడం కూడా ఒక అంశమని తెలుస్తున్నది. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అమితాబ్‌ బచ్చన్‌ హాజరైన సంగతిని ప్రస్తావిస్తూ జయాబచ్చన్‌కు టికెట్ ఇవ్వడాన్ని పల్లవి పటేల్‌ లేవనెత్తారని సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన అఖిలేశ్‌.. తమకు అప్నాదళ్‌ (కే) ఓటు అవసరం లేదని తెగేసి చెప్పారని తెలిసింది.


కుట్రదారులను కనిపెట్టేందుకు టెస్ట్‌


ఇదిలా ఉంటే.. ఇతరుల కోసం గోతులు తవ్వేవారు తాము తవ్వుకున్న గోతుల్లోనే పడతారని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలను ఆయన ప్రస్తావించారు. లాభాల కోసం చూసేవారే తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళతారని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని విమర్శించారు. తమ పార్టీలో కుట్రదారులు ఎవరో పరీక్షించేందుకు తాము మూడో సీటుకు పోటీ పెట్టామని అఖిలేశ్‌ చెప్పారు. నిజానికి సోమవారం రాత్రి ఎస్పీ ఎమ్మెల్యేలకు అఖిలేశ్‌ విందు ఇచ్చారు. దానికి 8 మంది హాజరుకాలేదు. అప్పుడే తిరుగుబాటును ఊహించానని చెప్పారు. వారికి వేర్వేరు ప్యాకేజీలు అందాయని వినిపిస్తున్నదని తెలిపారు. పార్టీ విప్‌ను ధిక్కరించినవారిని సస్పెండ్‌ చేస్తామని చెప్పారు.


కర్ణాటకలో బీజేపీకి షాక్‌


కర్ణాటకలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ మూడు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్‌ తరఫున అజయ్‌ మాకెన్‌, డాక్టర్‌ సయీద్‌ నసీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌ గెలుపొందారు. ముగ్గురికీ వరుసగా 47, 46, 46 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి నారాయణ బందగే కూడా విజయం సాధించారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్‌ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌కు ఓటేశారు. మరో ఎమ్మెల్యే అర్బైల్‌ శివరాం ఓటింగ్‌కు హాజరుకాలేదు. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు మద్దతుగా ఓటేసినట్టు బీజేపీ ధృవీకరించింది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపింది. పదేపదే మోసం చేసేవారిని ప్రజలు నమ్మబోరని కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్‌ అశోక మీడియాతో అన్నారు.


సోమశేఖర్‌ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. బీజేపీలో చేరి గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. హాయి నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి పనులు చేశారో, స్కూళ్లు కట్టించారో.. వారికే ఓటు వేశానని ఓటింగ్‌ అనంతరం సోమశేఖర్‌ చెప్పారు. ఆత్మప్రబోధానుసారం ఓటేశానని తెలిపారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష సభ్యుడు జీ జనార్దన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా ఓటేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఏకగ్రీవాల్లో బీజేపీ అత్యధికంగా 20 సీట్లు గెలుపొందింది. కాంగ్రెస్‌ 6, తృణమూల్‌ కాంగ్రెస్‌ 4, వైసీపీ 3, ఆర్జేడీ 2, బీజేడీ, 2, ఎన్సీపీ, బీఆరెస్‌, శివసేన, జేడీయూ ఒక్కొక్క స్థానం దక్కించుకున్నాయి. ఎన్నికలు జరిగిన సీట్లలో కాంగ్రెస్‌ 3, ఎస్పీ ?? గెలుచుకోగా.. బీజేపీ ?? స్థానాల్లో గెలుపొందింది.

Exit mobile version