Dagdusheth Ganesh | హోలీ పండుగ వేళ దగడూశేఠ్‌ గణపతికి ద్రాక్షపండ్లతో అలంకరణ.. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు..!

  • Publish Date - March 25, 2024 / 06:00 AM IST

Dagdusheth Ganesh : హోలీ పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని పుణె నగరంలోగల ప్రసిద్ధ శ్రీమంత్‌ దగడూశేఠ్‌ హల్వాయి గణపతి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 2 వేల కిలోల ద్రాక్షపండ్లతో గణనాథుడిని అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా నల్లని, ఆకుపచ్చని ద్రాక్ష పండ్లే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏటా సంకటహర చతుర్థి రోజున కూడా ఈ ఆలయంలో ‘ద్రాక్ష మహోత్సవం’ జరుపుకుంటారు. ఈ ద్రాక్ష మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తుంటారు.

‘సహ్యాద్రి ఫామ్స్‌’ ఆధ్వర్యంలో ‘ద్రాక్ష మహోత్సవం’ పేరుతో ప్రతి సంవత్సరం ఒక రోజు ఈ ఆలయాన్ని నలుపు, అకుపచ్చ ద్రాక్ష పండ్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అదే ఆచారం ప్రకారం ఇటీవలే పునరుద్ధించిన ఈ దగడూశేఠ్‌ గణపతి ఆలయంలో ఆదివారం కూడా ద్రాక్ష మహోత్సవం నిర్వహించారు. ఈ ద్రాక్ష మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. రెండు రంగుల ద్రాక్షలు, కిక్కిరిసన భక్తులతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది.

కాగా, ఈ శ్రీమంత్ దగడూశేఠ్ హల్వాయి గణపతికి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం.. వినాయకుడికి పరమ భక్తుడు, శ్రీమంతుడు అయిన శ్రీ దగడూశేఠ్‌ హల్వాయి, ఆయన భార్య లక్ష్మీబాయ్‌ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. అయితే ప్లేగు వ్యాధితో వారికి కొడుకు మరణించాడు. అది తట్టుకోలేక దగడూశేఠ్‌ హల్వాయి దంపతులు కొడుకు మృతదేహాన్ని ముంగటేసుకుని, ‘తమ కొడుకు తమకు కావాలి’ అని గుండెలు బాదుకుంటూ గణనాథుడిని వేడుకున్నారు. దాంతో చనిపోయాడనుకున్న వారి కొడుకు తిరిగి లేచాడు.

దాదాపు 130 ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగిందట. దాంతో దగడూశేఠ్‌ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. వినాయకుడు తమ కుమారుడిని బతికించాడన్న కృతజ్ఞతతో శ్రీమంతుడు అయిన దగడూశేఠ్‌ 130 ఏళ్ల కింద ఇక్కడ ఆలయాన్ని కట్టించాడట. అందుకే ఈ ఆలయానికి ‘శ్రీమంత్‌ దగడూశేఠ్‌ హల్వాయి గణపతి దేవస్థానం’ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రసిద్ధ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

గమనిక : ప్రతి ఏడాది స్వామివారి అలంకరణ కోసం వినియోగించిన ద్రాక్షపండ్లను ససూన్‌ ఆస్పత్రి, పితాశ్రీ వృద్ధాశ్రమంతోపాటు పలు సంస్థలలో పంచి పెడుతారు. 

Latest News