Site icon vidhaatha

దామన్నVS పటేల్‌: ఠాక్రే సమక్షంలోనే భగ్గుమన్న విభేదాలు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

విధాత: రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్ర స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు పనిచేసి కేంద్ర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని తిరిగే అధికారంలో ఇచ్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సూచించారు. బుధవారం కోదాడలో పీసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నల్గొండ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.

అంతకుముందు జరిగిన పార్టీ నల్గొండ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీ శ్రేణులు విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ప్రజల్లో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాల పట్ల నెలకొన్న వ్యతిరేకతను అవకాశంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని అధికారంలో తెచ్చేందుకు కృషి చేయాలి అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలుపు కోసం హాత్ సే హాత్ జోడో పాదయాత్రల ద్వారా పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల, వారి పనితీరు పట్ల, బిఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీల వైఫల్యల పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి బోసురాజు , ఏఐసీసీ సభ్యులు నిరంజన్, రాంరెడ్డి దామోదర రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి, పటేల్ రమేష్ రెడ్డి, నాయకులు చెవిటి వెంకన్న, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

మరోసారి భగ్గుమన్న విభేదాలు

నల్గొండ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలోనే మరోసారి పటేల్ రమేష్ రెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సమావేశంలో రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. 2017 తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారితో పార్టీ భ్రష్టు పట్టిపోతుందంటూ సూర్యాపేటకు చెందిన పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి తన వర్గీయులకు పెద్దపీట వేయడంతో పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని దామోదర్ రెడ్డి ఆరోపించారు. అదే సమయానికి సమావేశానికి వచ్చిన పటేల్ రమేష్ రెడ్డి తనపై దామోదర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన వర్గీయులతో కలిసి సమావేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ పరకాల వేణుగోపాల్‌లు అడ్డుకుని సర్ది చెప్పారు.

పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తనకు గానీ, తన వర్గీయులకుగాని సమావేశం గూర్చి సమాచారం ఇవ్వ లేదని, నియోజకవర్గంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న దామోదర్ రెడ్డి పార్టీకి నష్టం చేయడంతో పాటు తమపై తప్పుడు ఫిర్యాదు చేయడం ఏమిటంటూ వాగ్వాదానికి దిగారు.

ఇదిలాఉండగా సమావేశానికి నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల చెందిన కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం అందించగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన తుంగతుర్తి నియోజకవర్గ అద్దంకి దయాకర్, ఆలేరు బిర్ల ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ దుబ్బాక నరసింహ రెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్‌కు చెందిన డాక్టర్ చెరుకు సుధాకర్‌లు సమావేశానికి గైరాజరయ్యారు.

సూర్యాపేట నుంచి హాజరైన రేవంత్ రెడ్డి వర్గీయుడు పటేల్ రమేష్ రెడ్డికి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో కేవలం సీనియర్లు కె. జానారెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులు మాత్రమే హాజరు కావడం కనిపించింది.

Exit mobile version