Site icon vidhaatha

ఓటమి మంచిదే.. సరిదిద్దుకుంటాం! YCP నాయకుల అంతర్మథనం

విధాత: శాసనమండలి ఎన్నికల్లో ఊహించని విధంగా మూడు గ్రాడ్యుయేట్స్ స్థానాల్లోనూ ఓటమి పాలైన తరువాత వైఎస్సార్సీపీ నాయకులూ, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు ఏమనుకుంటున్నారు… ఆ పరాభవం గురించి ఎలాంటి చర్చ జరుగుతోంది. అవును…చర్చ ఉంటుంది.. వాస్తవానికి ఈ ఓటమి పార్టీని గట్టిగానే కుదిపేసింది. బయటకు మేకపోతు గాంభీర్యం చూపుతున్నా లోలోన గట్టిగానే కవుకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో ఇలా దెబ్బ తగలడం మంచిదేనని కొందరు నాయకులూ భావిస్తున్నారు. అవును.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తరువాత జరిగిన స్థానిక సంస్తల ఎన్నికల్లోనూ అదే ఊపు కనబర్చి దాదాపు 90 శాతానికి పైగా పదవులు గెలుచుకున్నారు. ఆఖరుకు చంద్రబాబు సారథ్యం వహిస్తున్న కుప్పంలోనూ వైసీపీ పైచేయి సాధించింది.

ఈ జోరు ఇలా సాగుతున్న తరుణంలో సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి బ్రేక్ పడింది. సరే ఈ దెబ్బ తగలడం మంచిదే.. ఇకనైనా మన నాయకుడు జగన్ దారికి వస్తాడు. కార్యకర్తలతో.. ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తాడు… ఈ దెబ్బతో అయినా పార్టీలోని తప్పులు, పొరపాట్లను సరిదిద్దుతాడు. అలా ఐతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరింత అప్రమత్తంగా ఉంది, మళ్ళీ విజయం వైపు వెళ్లొచ్చని భావిస్తున్నారు.

మరి కొందరైతే ఈ పొరపాటు లేదా ఓటమి మాకు ఓ గుణ పాఠం, ఇక మేము మరింత ఎలర్ట్ గా ఉండాలి.. ఎక్కడెక్కడ లోపాలున్నాయి చూసుకుని మరీ ఎత్తులు వేయాలి.. ప్రజలను మరింతగా ఆకట్టుకునేందుకు మాకు ఈ ఓటమి ఓ వేదికగా ఉపయోగ పడుతుంది.. మేము ఇక మరింత జాగ్రత్తగా లేకపోతె కష్టమే అని విశ్లేషించుకుంటున్నారు

Exit mobile version