Site icon vidhaatha

ఆరోసారి ఈడీ స‌మ‌న్లు.. రాన‌న్న ఢిల్లీ సీఎం

విధాత‌: ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఆప్ అధినేత‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోసారి స‌మ‌న్లు జారీచేసింది. ఈ స‌మ‌న్ల ప్ర‌కారం సోమ‌వారం ఆయ‌న ఈడీ ఎదుట హాజ‌రుకావాల్సి ఉండ‌గా, తాను హాజ‌రు కాబోన‌ని తేల్చి చెప్పారు. దర్యాప్తు సంస్థ ముందు ఢిల్లీ సీఎం హాజరుకాకపోవడం ఇది ఆరోసారి. ఈడీ నోటీసు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ కేసు కోర్టు విచార‌ణ‌లో ఉన్నందున ఈడీ మ‌ళ్లీ స‌మ‌న్లు పంపించ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని తెలిపారు. కోర్టు ఆర్డర్ కోసం వేచి ఉంటానని వెల్ల‌డించారు.

మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రశ్నించడానికి ఈడీ ఇప్ప‌టికే ఆప్ అధినేత‌ కేజ్రీవాల్‌కు ఐదు సార్లు స‌మ‌న్లు పంపించింది. ఐదుసార్లు ఆయ‌న ఈడీ ఆఫీస్‌కు వెళ్ల‌లేదు. తాజాగా కోర్టు హాజ‌రువాల‌ని కోర‌గా, వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రై త‌న వాద‌న‌ల‌ను వినిపించారు. ప్ర‌స్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందున ఈడీ స‌మ‌న్ల‌కు స్పందించ‌బోమ‌ని సోమ‌వారం మీడియాకు వెల్ల‌డించారు. ఈడీ సమన్లు పంపించ‌డం చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం అని పేర్కొన్నారు. ఈ కేసులో త‌మ‌ను నిందితులుగా పేర్కొనకపోవడాన్ని కూడా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.

2023 అక్టోబర్‌లో నవంబర్ 2న తమ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు తొలిసారిగా ఈడీ సమన్లు ​​పంపింది. కానీ, ఆయ‌న ఈడీ కార్యాల‌యం ఎదుట హాజ‌రుకాలేదు. ఢిల్లీలో పాలనకు సంబంధించిన పనులు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ ప్రచార కార్య‌క్ర‌మాలు ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం ఉన్నందున రాలేని స‌మ‌న్ల‌కు స‌మాధానం ఇచ్చారు.

రెండోసారి ఇచ్చిన స‌మ‌న్ల‌పై కూడా కేజ్రీవాల్ స్పందించ‌లేదు. రాజ్యసభ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవ వేడుక‌లు ఉన్నాయ‌ని పేర్కొంటూ మూడవ సమన్లు ​​దాట‌వేశారు. జనవరి 18-20 మధ్య ముందస్తు షెడ్యూల్ చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేజ్రీవాల్ గోవా పర్యటనకు వెళ్లారని నాలుగు, ఐదు స‌మ‌న్ల‌కు ఆప్ వర్గాలు పేర్కొన్నాయి.

Exit mobile version