న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో తాము జారీ చేసిన సమన్లకు స్పందించడం లేదంటూ ఈడీ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ సమన్ల కేసులో కోర్టుకు కేజ్రీవాల్ నేరుగా హాజరుకావడం ఇదే మొదటిసారి. గతంలో ఫిబ్రవరి 17, 2024న ఢిల్లీ కోర్టుకు వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. కాగా, శనివారం హాజరైన కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ.. 15000 రూపాయల విలువైన బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. రెండు బాండ్లను కేజ్రీవాల్ సమర్పించినందున ఆయనను వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.
లిక్కర్ పాలసీ కేసులో వరుసగా ఐదోసారి జారీ చేసిన నోటీసులకు కూడా కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఈడీ అధికారులు ఫిబ్రవరి 3, 2024న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఫిబ్రవరి 17, 2024న కోర్టుకు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోరింది. అయితే.. ఆ రోజు కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. భౌతికంగా కోర్టుకు హాజరయ్యేందుకు మినహాయింపు కోరారు. దానిపై విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు స్వయంగా హాజరుకావాలని పేర్కొంది.
లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటి వరకూ 8 సార్లు సమన్లు జారీ చేసింది. అందులో మూడు సమన్లు ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసిన తర్వాతివి. ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నదంటూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు రాలేదు. ఎనిమిదో సారి జారీచేసిన సమన్లకు స్పందించిన కేజ్రీవాల్.. మార్చి 12 తర్వాత వర్చువల్ పద్ధతిలో దర్యాప్తు సంస్థ ఎదుట హాజరయ్యేందుకు అంగీకరించారు. ప్రస్తుతం రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ కేసులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఢిల్లీ సీఎంను విచారించాలని ఈడీ ప్రయత్నిస్తున్నది.
అయితే.. అధికార బీజేపీ ఆదేశాల ప్రకారమే ఈడీ నడుచుకుంటున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వ ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని ఈడీ ప్రయత్నిస్తున్నదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో శుక్రవారం భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవితను దర్యాప్తు సంస్థ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే.