Raaj Kumar | ఈడీ సోదాలు ఎదుర్కొన్న మంత్రి.. ఆప్‌కు రాజీనామా

  • Publish Date - April 10, 2024 / 05:55 PM IST

  • అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఆప్‌

  • అదే అవినీతిలో ఇప్పుడు కూరుకుపోయింది

  • రాజకీయాలు మారలేదు.. రాజకీయ నాయకులు మారిపోయారు

  • ఇలాంటి స్థితిలో ప్రభుత్వంలో ఉండలేను

  • ఢిల్లీ సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌

  • ఇప్పటికే ఈడీ, డీఆర్‌ఐ విచారణలో రాజ్‌కుమార్‌

 

న్యూఢిల్లీ: ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ఆప్‌ నేత ఆ పార్టీకి, ప్రభుత్వానికి రాజీనామా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ.. ఆ పార్టీకి పటేల్‌ నగర్‌ ఎమ్మెల్యే, ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌కు అందించిన అనంతరం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశ రాజకీయాలు మారితేనే దేశం మారుతుందని తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేజ్రీవాల్‌ చెప్పారు. కానీ, ఈ రోజు చాలా బాధతో చెబుతున్నా.. రాజకీయాలు మారలేదు కానీ.. రాజకీయ నాయకులు మారిపోయారు’ అని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఆప్‌ ఆవిర్భవించిందని రాజ్‌కుమార్‌ చెప్పారు. కానీ ఈ రోజు అదే అవినీతి ఊబిలో ఆ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీలో దళితులకు, వెనుకబడిన వర్గాలకు తగిన గౌరవం లభించడం లేదని రాజ్‌కుమార్‌ ఆరోపించారు. ‘వారు ప్రతి మీడియా సమావేశంలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంబేద్కర్‌ ఫోటో పెట్టుకుంటారు. కానీ ఆయన సిద్ధాంతాలు పాటించరు. చట్టం రిజర్వేషన్లను కల్పిస్తున్నది. కానీ నిజమైన ప్రాతినిధ్యం విషయంలో మాత్రం ఆప్‌కు ఉన్న 13 మంది ఎంపీల్లో ఒక్కరంటే ఒక్కరు దళితులు లేదా వెనుకబడిన వర్గాలకు చెందినవారు లేరు’ అని రాజ్‌కుమార్‌ విమర్శించారు.

దీనివల్లే తనకు ప్రభుత్వంలో కొనసాగటం కష్టంగా ఉన్నదని చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి రాజీనామా సమర్పించానని తెలిపారు. అవినీతి కార్యక్రమాల్లో తన పేరు ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అసలు తమ పార్టీకి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న నేపథ్యంలో రాజ్‌కుమార్‌ రాజీనామా అంశం ప్రాధాన్యం సంతరించుకున్నది.

రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఈడీ నిఘాలో ఉన్నారు. చైనాకు వ్యాపార పెట్టుబడుల నిమిత్తం హవాలా మార్గంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలు పంపారనే అంశంలో ఈడీ, డీఆర్‌ఐ ఆయనను ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఈడీ అధికారులు ఆనంద్‌ నివాసాలతోపాటు మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంలో దాదాపు 22 గంటలపాటు తనిఖీలు కొనసాగాయి.

చైనాకు చేసిన కొన్ని చెల్లింపులకు సంబంధించిన ఆధారాలు ఆయన కంపెనీకి చెందిన కీలక ఉద్యోగుల నుంచి సంపాదించామని ఈడీ చెబుతున్నది. వాటితోపాటు 74 లక్షల నగదు, కొన్ని కీలక పత్రాలు, డిజిటల్‌ రికార్డులను స్వాధీనం చేసుకున్నామని అప్పట్లో పేర్కొన్నది. అయినా ఆ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద అంశాలు వెలుగు చూడలేదని, కానీ, వ్యక్తులను హింసించేందుకే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం తనిఖీలు చేయిస్తున్నదని రాజ్‌కుమార్‌ ఆనంద్‌ మండిపడ్డారు.

Latest News