Site icon vidhaatha

వైద్య చ‌రిత్ర‌లో అద్భుతం.. పెయింట‌ర్‌కు రెండు చేతులు అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు

న్యూఢిల్లీ : ఇది వైద్య చ‌రిత్ర‌లోనే అద్భుతం. ఇప్ప‌టి వ‌ర‌కు గుండె, మూత్ర‌పిండాలు, కాలేయం వంటి అవ‌య‌వ మార్పిడిల‌ను చూశాం. ఆ చికిత్స‌లు ఎంతో మందికి విజ‌య‌వంతం కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు ఓ పెయింట‌ర్‌కు రెండు చేతుల‌ను అమ‌ర్చి.. ఢిల్లీ వైద్యులు చ‌రిత్ర సృష్టించారు. ఆ రోగి కూడా విజ‌య‌వంతంగా కోలుకుంటున్నాడ‌ని వైద్యులు తెలిపారు.

ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి(45) 2020లో జ‌రిగిన ఓ ప్ర‌మాదంలో రెండు చేతుల‌ను కోల్పోయాడు. అత‌ను వృత్తి రీత్యా పెయింట‌ర్ కావ‌డంతో.. అత‌ని ఉపాధి కూడా ఆగిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన అత‌ను చ‌నిపోవాల‌నుకున్నాడు. కానీ ఢిల్లీలోని స‌ర్ గంగా రామ్ హాస్పిట‌ల్ వైద్యులు అత‌నికి రెండు చేతుల‌ను అమ‌ర్చి.. కొత్త జీవితాన్ని ప్ర‌సాదించారు. అయితే ఇక్క‌డ ఓ అద్భుతం జ‌రిగింది.

అదేంటంటే.. ద‌క్షిణ ఢిల్లీ స్కూల్‌లో ప‌ని చేస్తున్న మీనా మెహ‌తా.. బ్రెయిన్ డెడ్‌కు గుర‌య్యారు. అయితే తాను చ‌నిపోతే త‌న అవ‌య‌వాల‌ను దానం చేయాల‌ని కుటుంబ స‌భ్యుల‌కు మీనా చెప్పారు. దీంతో బ్రెయిన్ డెడ్‌కు గురైన మీనా అవ‌య‌వాలు.. కిడ్నీ, లివ‌ర్, కార్నియాతో పాటు రెండు చేతుల‌ను దానం చేయాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. కిడ్నీ, లివ‌ర్, కార్నియాను ముగ్గురికి అందించారు. రెండు చేతుల‌ను పెయింట‌ర్‌కు అంద‌జేశారు.

మీనా రెండు చేతుల‌ను స‌ర్ గంగా రామ్ ఆస్ప‌త్రి వైద్యులు.. పెయింట‌ర్‌కు అమ‌ర్చారు. ఈ స‌ర్జ‌రీకి 12 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. బాధితుడు ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడ‌ని వైద్యులు తెలిపారు. గురువారం అత‌న్ని డిశ్చార్జి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. డోనార్‌, రిసిపియంట్ చేతుల‌కు చెందిన అన్ని న‌రాలు, కండ‌రాలను క‌లిపారు. దీంతో డాక్ట‌ర్లు ప‌డ్డ శ్ర‌మ ఫ‌లించింది. స‌ర్జ‌రీ త‌ర్వాత డాక్ట‌ర్ల‌తో ఫోటో దిగిన స‌మ‌యంలో ఆ పెయింట‌ర్ త‌న చేతుల‌తో థ‌మ్స్ అప్ సంకేతం ఇస్తూ ఉత్స‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు.

Exit mobile version