Site icon vidhaatha

ఢిల్లీలో పొగమంచు.. 30 విమానాలు ఆలస్యం


న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు రాక‌పోక‌లు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయంలో, అంతర్జాతీయ విమానాలతో సహా దాదాపు 30 విమానాలు వ‌చ్చే, వెళ్లే రెండింటిలోనూ ఆలస్యం అయ్యాయి. దేశ రాజధానిలో 7 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయిన‌ట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.


మంగళవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్ విమానాల ఆల‌స్యాన్ని సూచించింది. రోజంతా మరిన్ని విమానాల‌పై ఆల‌స్యం ప్రభావితం ప‌డుతుంద‌ని ఎయిర్‌పోర్టు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రయాణికులు ఎయిర్‌లైన్‌ను సంప్రదించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌యాల‌ను తీసుకోవాల‌ని సూచించాయి. సోమ‌వారం కూడా ఇలాగే విమానాలు ఆల‌స్యంగా న‌డిచాయి. ద‌ట్ట‌మైన పొగ మంచు కార‌ణంగా 300 మీట‌ర్ల కొద్ది దూరంలో ఏమున్న‌దో కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు ఆటంకం క‌లుగుతున్న‌ట్టు ఎయిర్‌పోర్టు వ‌ర్గాలు తెలిపాయి.


ఇండియా గేట్, సరాయ్ కాలే ఖాన్, ఎయిమ్స్‌, సఫ్దర్‌జంగ్, ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో ద‌ట్టంగా పొగ‌మంచు క‌మ్ముకున్న దృశ్యాలు సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అంతటా పొగమంచు విస్త‌రించి ఉన్న‌ ఉపగ్రహ చిత్రాల‌ను ఐఎండీ విడుద‌ల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, కాన్పూర్‌లలో, విజిబులిటీ దాదాపు సున్నాకి పడిపోయింది. ఇది రోజువారీ ప్ర‌జ‌ల జీవితానికి తీవ్ర అంతరాయం కలిగించింది.

Exit mobile version