విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2లక్షల రుణమాఫీ అమలు ప్రక్రియను త్వరలోనే చేయబోతున్నామని డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.అసెంబ్లీలో శనివారం భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి బడ్జెట్ వివరాలు వెల్లడిస్తూ ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ సర్కారు రూ. 19,746 కోట్లు కేటాయించిందన్నారు. ఎన్నికలలో రైతులకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు.
త్వరలోనే కార్యాచరణ ప్రారంభం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించగా.. అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులు ఎక్కవగా లాభం పొందారని, పనికిరాని కొండలు, గుట్టలకు కూడా రైతుబంధును గత ప్రభుత్వం అందజేసిందన్నారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు కూడా రైతుబందు అందజేసిందన్నారు. రైతు బంధు నిబంధనలను పున సమీక్షించి నిజమైన అర్హులను గుర్తించి ఎకరాకి ఏడాదికి రూ 15 వేలు అందజేస్తామని భట్టి తెలిపారు. పసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామన్నారు.