Site icon vidhaatha

యాదాద్రి ఫ్లాంట్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి


విధాత, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌లు వేగంగా పూర్తి చేసి రానున్న ఆక్టోబర్‌ కల్లా పూర్తి స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి ఆయన ఫ్లాంట్‌ను సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


కాంట్రాక్టు తీసుకున్న ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ త్వరగా పనులు పూర్తి చేయకపోతే సంస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఫ్లాంట్‌ పనుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న అలవాట్లను పద్ధతులను అధికారులు మార్చుకోవాలన్నారు. పవర్ ఫ్లాంట్‌ జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందన్నారు. నిర్మాణ వ్యయం 35వేల కోట్ల నుంచి 55వేల కోట్లకు పెరిగిపోయిందన్నారు.


గతంలో సబ్‌ టెండర్ల ఖరారులో, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయన్నారు. వాటన్నింటిపై విచారణకు ఆదేశించామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ఫాంట్‌ పనులు వేగవంతం చేసేందుకే క్షేత్రస్థాయి పర్యటన చేపట్టామన్నారు. ఫ్లాంట్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.


ఫ్లాంట్‌ను త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . యాదాద్రి పవర్ ప్లాంట్‌ ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ పవర్, రెనేవబుల్ ఎనర్జీ వైపు వెళ్తుంటే గత పాలకులు థర్మల్ పవర్ వైపు దృష్టిసారించారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనా దీప్తి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు.

Exit mobile version