Site icon vidhaatha

Dharmaram School: 75 వసంతాలు పూర్తి చేసుకున్న ధర్మారం పాఠశాల.. ఘ‌నంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు

Dharmaram School, 75 years

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేశానని వరంగల్ జిల్లా కలెక్టర్(Collector) డాక్టర్ బి. గోపి(Gopi) అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ బిడ్డలను చేర్పించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జడ్పీహెచ్ఎస్ ధర్మారం పాఠశాల(Dharmaram School) 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు శుక్రవారం ఉత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేశానన్నారు.

ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు..

ఒక పాఠశాల 75 సంవత్సరాల వేడుక జరుపుకోవడం అరుదు అని, ఇది చరిత్రలోనే నిలిచిపోతుందని కలెక్టర్ అన్నారు. ఈ పాఠశాలలో గణనీయమైన స్థాయిలో ఈ విద్యా సంవత్సరంలో 130 మంది అడ్మిషన్లు పొందడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. మన ఊరు మనబడి, మన బస్తి మనబడి కార్యక్రమంలో ప్రభుత్వంతో పాటు సమాజం కూడా తమ వంతు భాగస్వామ్యాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని గ్రామ ప్రజలను, హాజరైన పూర్వ విద్యార్థులను కోరారు.

కార్యక్రమంలో 1948 సంవత్సరం నుండి 1972 సంవత్సరం వరకు, 1972-73, 1989-90,2010-2011 నుండి 2015-2016 వరకు 10 వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనానికి హాజరైనారు. పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఆయా సంవత్సరాలలో 10 వ తరగతిలో టాప్ ర్యాంక్ లు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ప్ర‌ధానోపాధ్యాయురాలు టి.సుజాత, పాఠశాల స్టాఫ్, సిబ్బంది, స్థానిక పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Exit mobile version