No-Confidence
- 10వ తేదీ వరకు కొనసాగింపు
- చివరి రోజు మోదీ సమాధానం
- బీఏసీ సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ 8వ తేదీ నుంచి చర్చించనున్నది. మూడు రోజుల చర్చ అనంతరం ప్రధాని నరేంద్రమోదీ సమాధానం ఇస్తారు. మంగళవారం జరిగిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. వెంటనే అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, అవిశ్వాసం ఇచ్చినా ప్రభుత్వం లెజిస్లేటివ్ అజెండాను అమలు చేసుకుంటూ పోవడాన్ని నిరసిస్తూ ఈ సమావేశాన్ని ఇండియా కూటమి, ప్రతిపక్ష బీఆరెస్ బహిష్కరించాయి. ప్రభుత్వం మాత్రం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వెంటనే చేపట్టాలని నిబంధన ఏదీ లేదని చెబుతున్నది.
కాగా.. నోటీసును ఆమోదించిన పది రోజుల్లో చర్చను చేపట్టాలని నిబంధనలు పేర్కొంటున్నాయని ప్రస్తావిస్తున్నది. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసపై ప్రధాని సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి అధికార పక్షం సిద్ధపడకపోవడంతో జూలై 26న ప్రతిపక్షాల ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది.
సంఖ్యపరంగా బలంగా ఎన్డీఏ
లోక్‌సభలో మొత్తం 543 మంది సభ్యులకు గాను ప్రస్తుతం ఐదు ఖాళీలు ఉన్నాయి. అంటే 538 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎన్డీయే కూటమికి 334 మంది సభ్యుల బలం ఉన్నది. ఇండియా కూటమికి 147 మంది సభ్యులు ఉన్నారు. ఏ కూటమికీ చెందని వారు 57 మంది ఉన్నారు. ఇందులో వైసీపీ నుంచి 22, బీజేడీ నుంచి 12, బీఎస్పీ నుంచి 9, బీఆరెస్ నుంచి 9, టీడీపీ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. సంఖ్యాబలంగా చూస్తే అవిశ్వాస తీర్మానం విషయంలో ఎన్డీయే కూటమికి ఎలాంటి ఇబ్బందీ లేదు. తీర్మానం వీగిపోతుంది.
కానీ.. ప్రధాని నరేంద్రమోదీని ఈ అంశంపై పార్లమెంటులో మాట్లాడేలా చేయడం ద్వారా తాము విజయం సాధించినట్టేనని ప్రతిపక్షాల కూటమి చెబుతున్నది. 2014 తర్వాత మోదీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొడం ఇది రెండోసారి. గతంలో 2018 జూలై 20 మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చింది. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. 126 మంది మాత్రమే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చారు. 325 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వం సునాయాసంగా విజయం సాధించింది.