విధాత: లైఫ్ స్టైల్ ఛేంజేస్ వల్లే రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శరీరానికి శ్రమ లేకుండా జీవితాన్ని గడుపుతున్నామని ఆయన అన్నారు. మేడ్చల్ జిల్లాలో సీపీఆర్ శిక్షణ ప్రారంభం సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. సాధారణ రోగాలతో పాటు నాన్ కమ్యూనికేబుల్ రోగాలు అధికంగా వస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు. నాన్ కమ్యూనికేబుల్ రోగాల్లో అతి ముఖ్యమైంది.. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అని మంత్రి తెలిపారు.
కార్డియాక్ అరెస్టు నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో లక్ష మందికి, జిల్లాల్లో వందల మందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆఫీసులు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో సీపీఆర్ గురించి తెలిసిన వారిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆశ్చర్యకరమైన వీడియోను చూశాను.
పెళ్లి వేడుకలో ఓ పిల్లోడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కానీ వారి ప్రాణాలను కాపాడుకోలేకపోయాం. ఒక వేళ సీపీఆర్ గురించి తెలిసిన వారు అక్కడుంటే వారి ప్రాణాలు దక్కేవని KTR తెలిపారు.
సీపీఆర్‌ను నేర్పించగలిగితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్టును తగ్గించొచ్చు. రక్త ప్రసరణ ఆగి పోకుండా ప్రాథమికంగా ఆ వ్యక్తిని కాపాడుకోవచ్చు అని కేటీఆర్ అన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ బ్రహ్మాండంగా ముందుకు పోతుందన్నారు కేటీఆర్.
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో 2 వేల బెడ్ల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించామని కేటీఆర్ తెలిపారు.