Site icon vidhaatha

నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు కార్మికుల ఆత్మహత్య యత్నం


విధాత : నిబంధనల మేరకు జీతాలు పెంచకపోగా, ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించిన కార్మికులను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగాల నుంచి తొలగించడం భరించలేక నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు అవుట్ సోర్సింగ్ శానిటేషన్ మహిళా కార్మికులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాగమణి, జానకి, లలితలు గుర్తు తెలియని మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, తోటి సిబ్బంది వెంటనే వారిని అదే ఆసుపత్రిలో చేర్పించారు.


బాధిత కార్మికులు ఇటీవల తమ జీతాల సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి జీవో నెం.60 ప్రకారం వారి జీతాలను వెంటనే పెంచాలని అప్పటి సూపరింటెండెంట్ లచ్చునాయతో పాటు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అదేశాలు జారీ చేశారు. అయినా సంబంధిత సాయి ఏజెన్సీ మంత్రి ఆదేశాలను మాత్రం అనులు చేయలేదు. అంతే కాకుండా ఎవరైతే తమ ఏజెన్సీపై మంత్రికి ఫిర్యాదు చేశారో వారిని విధుల నుంచి తొలగించారు. అసలు రికార్డులలో వారి పేరు లేకుండా చేశారు.


తమను ఉద్యోగం నుంచి తొలగించారనే సమాచారం తెలియగానే సిబ్బంది నాగమణి, జానకీ, లలితలు గుర్తు తెలియని మాతలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గుర్తించిన తోటి సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం అదే అసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. తమకు జరిగిన అన్యాయంపై వారు శుక్రవారం ఉదయం నుంచి ఆందోళన చేపట్టగా, ఎవరు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లుగా బాధితులు తెలిపారు. బాధితుల ఆందోళనకు సీపీఎం, సీఐటీయూ సహా కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. మహిళా కార్మికుల ఆత్మహత్య విషయమై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version