విధాత: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు జామెట్రీ బాక్స్ కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థులు చదువులో ముందుండాలని కోరారు.
మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని కన్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్షల నిమిత్తం పరీక్షలు రాసేందుకు వెళుతున్న విద్యార్థులకు 6 రోజుల పాటు పరీక్ష కేంద్రానికి సొంత ఖర్చుతో వాహనాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
దీంతో పాటు డబ్బా గ్రామ ప్రభుత్వ పాఠశాల నుండి పరీక్షలలో విజయం సాధించి, ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి 1000 నగదుతో పాటు శాలువాతో సత్కారం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మెన్ ఎద్దు ప్రకాశ్, యూత్ ప్రధాన కార్యదర్శి తూమోజు వెంకటేష్, సభ్యులు శ్రీకాంత్, యువ నాయకులు దుర్గం విజయ్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.