Site icon vidhaatha

అవిశ్వాసాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా.. నాలుగేండ్ల సవరణతో అటకెక్కేనా?

విధాత: మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రతిపాదించే కాలాన్ని మూడేళ్ల నుండి నాలుగేళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మున్సిపల్ చట్టం బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలో చోటు చేసుకున్న అవిశ్వాస తీర్మాల ప్రతిపాదన భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.

గవర్నర్ వద్ద ఉన్న ఆరు బిల్లులలో మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. గవర్నర్ కు, ప్రభుత్వానికి మధ్య వివాదంతో ఆ బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. తాజాగా హైకోర్టులో గవర్నర్ పై వేసిన పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి అవకాశం ఇస్తామన్న నేపథ్యంలో సదరు పెండింగ్ బిల్లుల ఆమోదంపై పురోగతి ఉంటుందని అధికార పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తే రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో ప్రస్తుత చైర్మన్లపై పెడుతున్న అవిశ్వాస తీర్మానాల ప్రతిపాదనలు అటకెక్కే అవకాశ ముంది. అదే జరిగితే అవిశ్వాసంపై ఆశలు పెట్టుకొని క్యాంప్ రాజకీయాలకు పాల్పడుతున్న ఆశావాహ కౌన్సిలర్ల వ్యయ ప్రయాసలు వృధా కాక తప్పదన్న వాదన వినిపిస్తుంది.

మరోవైపు అవిశ్వాసాలకు మూడేళ్లు… నాలుగేళ్ల కాలం అంటూ చట్టపర నిబంధన విధించడం రాజ్యాంగ విధానాలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి సంస్థలు తప్పుపడుతున్నాయి. పాలకవర్గాల పై అవిశ్వాసం పెట్టడం ప్రజాస్వామిక హక్కు అని, రాజ్యాంగం కల్పించిన అవకాశం అని అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు నిబంధనలు విధించడం సరికాదంటున్నాయి.

Exit mobile version