- యజమానికి 60 గాయాలు
Dog Attack | భోపాల్ : కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటే, అవి కూడా మన పట్ల అంతే విశ్వాసాన్ని కనబరుస్తాయి. అయితే సమయానికి ఫుడ్ పెట్టలేదనే కోపంతో ఓ శునకం యజమానిపై విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో యజమానికి 60 గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన తేజేంద్ర ఘోర్పడే అనే వ్యక్తి ఓ కుక్క(రాట్‌వీలర్)ను పెంచుకుంటున్నాడు. సోమవారం మొత్తం కుక్కకు ఆహారం అందించలేదు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఆ కుక్కకు ఆహారం పెట్టేందుకు వెళ్లగా, అది కోపంతో రెచ్చిపోయింది.
ఆకలితో ఉన్న ఆ శునకం తేజేంద్రపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతని బట్టలను చింపేసింది. కాళ్లు, చేతులపై కొరికింది. దీంతో తేజేంద్రకు 60 గాయాలయ్యాయి. కుక్క దాడి నుంచి తేజేంద్రను అతని కుమారుడు కాపాడాడు. తేజేంద్ర ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.