Site icon vidhaatha

విద్యార్థుల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దు.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ విచార‌ణ వాయిదా

విధాత‌, హైద‌రాబాద్: తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమిన‌రి ప‌రీక్ష ఒక‌సారి పేప‌ర్ లీకేజీ కార‌ణంగా ర‌ద్దుచేయ‌గా, రెండో సారి నిర్వ‌హించిన ప‌రీక్ష‌ను బ‌యోమెట్రిక్ స‌మ‌స్య కార‌ణంగా నిలిపివేస్తున్నారు. ఇలా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు లేకుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తూ విద్యార్థుల జీవితాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని రాష్ర్ట ప్ర‌భుత్వంపై హైకోర్టు మండిప‌డింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. రేపుటిలోగా పూర్తి వివ‌రాల‌తో రావాల‌ని విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేసింది.



రెండో సారి నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో విద్యార్థుల బ‌యోమెట్రిక్ తీసుకోలేద‌ని, ప‌రీక్ష‌ను మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ఆదేశిస్తూ ఈనెల 23న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ర‌ద్దుచేస్తున్న‌ట్లు సింగ‌ల్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో సింగ‌ల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్‌పీఎస్సీ స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌కు అప్పీల్ దాఖ‌లు చేసింది. ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తే చాలా మంది విద్యార్థులు న‌ష్ట‌పోతారని, ప‌రీక్ష‌ను ప‌క‌డ్బందీ ఏర్పాట్ల మ‌ధ్య నిర్వ‌హించామ‌ని, ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయ‌కుండా విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగేలా ఆదేశాలు ఇవ్వాల‌ని అప్పీల్‌లో పేర్కొన్నారు.



ఈ పిటిష‌న్ పై బుధ‌వారం న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జ‌స్టిస్ అనిల్‌కుమార్ ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. పిటిష‌న‌ర్స్ త‌రుఫున హైకోర్టు న్యాయ‌వాది గిరిధ‌ర్ రావు వాద‌న‌లు వినిపిస్తూ.. మొద‌టిసారి ప్ర‌భుత్వ నిర్లక్ష్యంతోనే గ్రూప్‌-1 ప్రిలిమిన‌రి ప‌రీక్ష ర‌ద్దైంద‌ని తెలిసికూడా రెండో సారి ప‌రీక్ష నిర్వ‌హించేటప్పుడు ఎలాంటి జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోలేద‌ని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువ‌చ్చారు. టీఎస్‌పీఎస్సీ సిబ్బంది ప‌రీక్ష‌లో పార‌ద‌ర్శ‌కత పాటించకుండా విద్యార్థుల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని గుర్తు చేశారు.


టీఎస్‌పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్‌సైట్లో 2,33,506 మంది ప‌రీక్ష రాశారు అని చెప్పిన అధికారులు, కోర్టులో దాఖ‌లు చేసిన కౌంట‌ర్ అఫిడ‌విట్ లో మాత్రం 2,33,248 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారని తెలిపారు. అంటే 258 మంది విద్యార్థుల‌ను ఎక్కువ చేసి చూపించ‌డం ఏంట‌ని అన్నారు. అనంత‌రం ప్ర‌భుత్వం త‌రుఫున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ (ఏజీ) బీఎస్ ప్ర‌సాద్ వాద‌న‌లు వినిపిస్తూ.. బయో మెట్రిక్ విధానంలో సాంకేతికత, సమయం లేకపోవడం వల్ల బయోమెట్రిక్ పెట్టలేకపోయామని కోర్టుకు తెలిపారు. బయోమెట్రిక్ విధానం వల్ల సమస్యలు ఉన్నాయని.. మొదటిసారి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లోనూ బయోమెట్రిక్ సమస్యలు వచ్చాయని తెలిపారు.


దీనిపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఇటీవ‌ల పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్ష రాసిన 6 ల‌క్ష‌లకు పైన విద్యార్థులకు బయోమెట్రిక్ తీసుకున్నార‌ని, కానీ గ్రూప్‌-1 ప‌రీక్ష‌లో మాత్రం 2 ల‌క్ష‌ల పైన విద్యార్థులు ఉంటే, వారి నుంచి బ‌యోమెట్రిక్ తీసుకోవడానికి ఇబ్బందెంటో అర్థం కావడంలేదన్నారు. మిగతా పరీక్షలకు బయోమెట్రిక్ విధానం అమలవుతునప్పుడు.. గ్రూప్-1కు మాత్రమే సమస్య ఎందుకు వస్తుందన్నారు. ఇరువురి వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం.. మొద‌టిసారి నిర్వ‌హించిన గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ పెట్టి రెండో సారి పెట్టకపోవడానికి కారణాలేంటని ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించింది.


రెండో సారి ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ప్పుడు వెబ్‌సైట్లో ఎందుకు చెప్ప‌లేద‌ని ప్ర‌శ్నించింది. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ‌ర్మాస‌నం ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయ్యి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్‌పీఎస్సీ విఫలమవుతోందని పేర్కొంది. అనంత‌రం ఏ ఏ పరీక్షల్లో బయోమెట్రిక్ ఎంతమందికి వాడారనే వివరాలు ఇవ్వాలని పిటిష‌న‌ర్‌ను ఆదేశించింది. అదేవిధంగా బ‌యోమెట్రిక్ కు సంబంధించి పూర్తి వివ‌రాలు రేప‌టిలోగా ఇవ్వాల‌ని ఆదేశిస్తూ.. త‌దుప‌రి విచార‌ణ‌ను న్యాయ‌స్థానం బుధ‌వారానికి వాయిదా వేసింది.

Exit mobile version