Site icon vidhaatha

కాంగ్రెస్‌తోనే కరువొచ్చింది.. పార్టీ గేట్లు కాదు..ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేయండి


విధాత‌: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు నష్ట పరిహారం ఇచ్చి అన్న‌దాత‌ల‌ను ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధ‌వారం నర్సంపల్లి తండాలో ఎండి పోయిన వరి పంట పొలాలను ఆయ‌న పరిశీలించారు. సేద్యంపైనే ఆధార‌ప‌డి జీవిస్తున్న రైత‌న్న‌ల కుటుంబాలు పంట‌లు ఎండిపోవ‌డంతో తీవ్రంగా న‌ష్ట‌పోయార‌న్నారు. పంట‌లు ఎండిపోకుండా ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని, అది మరిచి ప్రతిపక్ష నాయకులను చేర్చు కోవడానికి పార్టీ గేట్లు ఎత్తుతున్నారని విమర్శించారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుభరోసా, రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక క‌రెంటు కూడా స‌క్ర‌మంగా రావ‌ట్లేద‌ని, ఇప్ప‌టికైనా నీళ్లు విడిచి పంట‌ల‌ను కాపాడాల‌న్నారు. న‌ష్ట‌పోయిన రైతులకు ఎక‌రానికి రూ. 15వేల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారిని భ‌యభ్రాంతుల‌కు గురి చేసి కాంగ్రెస్‌లోకి తీసుకెళ్ల‌డం మానుకోవాల‌న్నారు. రైత‌న్న‌లు పంట‌లు ఎండి నానా ఇబ్బందులు ప‌డుతుంటే కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం హైద‌రాబాద్‌లో కూర్చొని మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నుంచి నీటిని వ‌దిలి పంట‌ల‌ను కాపాడాల‌ని ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Exit mobile version