Site icon vidhaatha

ED Notice To Kavitha । కవితను విచారణకు పిలిచారా? అరెస్టుకా?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో తదుపరి జరిగే పరిణామాలపై చర్చ జోరందుకున్నది. ఆమెను విచారణకు పరిమితం చేస్తారా? లేక విచారణ అనంతరం అరెస్టు చేసేందుకు వీలుగా రప్పిస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విధాత : ఢిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Case) ఇప్పటికే అరెస్టైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) నుంచి ఈడీ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఆయన కవితకు బినామీ అని ఈడీ (Enforcement Directorate) మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court)కు తెలిపిన సంగతి తెలిసిందే. రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈడీ గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నది.

ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత (MLC K Kavitha) స్పందిస్తూ.. ‘చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. ముందస్తు అపాయింట్‌మెంట్ల దృష్ట్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటాను’ అని తెలిపారు. అదే సమయంలో తనకు నోటీసులు ఇవ్వడం ద్వారా కేసీఆర్‌ను (CM KCR) , బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీని లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలని కూడా అన్నారు.

ఇప్పటికి 11 మంది అరెస్ట్‌

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసింది. ఇదే కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు Gorantla Buchibabu) కు సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court) సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన వృత్తిపరమైన విషయాల్లోనే సమావేశాల్లో పాల్గొన్నారని, తన క్లయింట్‌ కవిత ప్రయోజనాల కోసమే ఆయన ప్రాతినిథ్యం వహించారని సేకరించిన వాట్సప్‌ మెస్సేజ్‌ల ద్వారా స్పష్టమైందని బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ సీఎం మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) జ్యుడిషియల్‌ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న విచారణ చేపట్టనున్నట్టు జడ్జి తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో దాదాపు అందరినీ ఈడీ అదుపులోకి తీసుకున్నది. ఈ సమయంలో బీజేపీ నేతలు తర్వాత అరెస్టయ్యేది కవితేనని రెండు మూడు రోజులుగా మీడియాతో అంటున్నారు.

కౌంటర్లు.. ఎన్‌కౌంటర్లు..

ఈ కేసులో కవిత విచారణకు వెళ్తే అరెస్టు చేస్తారా? లేదా అన్నది వేరే విషయం. కానీ ఆమెకు నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర మంత్రులు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి బీజేపీ, ఇతర ప్రతిపక్ష నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. బండి సంజయ్‌ అయితే ఏకంగా విచారణకు హాజరై, నిర్దోషిగా నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. దీంతో ఈ కేసులో తర్వాత ఏం జరగబోతున్నదనే చర్చ జోరుగా నడుస్తున్నది. ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవచ్చని అన్నట్టు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ కేసులో తన పేరు ఈడీ చార్జీషీట్‌లో పేర్కొన్న నాటి నుంచి అరెస్టులకు భయపడేది లేదని కవిత చెబుతూ వస్తున్నారు. కానీ ఇవాళ మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే.. కవిత విచారణ సందర్భంలో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేయడానికే పార్టీ అధిష్ఠానం ఇలా చేస్తున్నదా? అనే చర్చ జరుగుతున్నది.

ఢిల్లీకి బయల్దేరిన కవిత

ఈడీ నోటీసుల ప్రకారం కవిత రేపు విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటాను అన్న ఆమె న్యాయవాదులు, బీఆర్‌ఎస్‌ నేతలతో చర్చించారు. తన తండ్రి, సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడారు. ఆందోళనపడాల్సిన పని లేదన్న కేసీఆర్‌.. నీ కార్యక్రమాలు నువ్వు నిర్వహించుకో.. అని సూచించారని తెలిసింది.

బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడుదామని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మహిళా రిజర్వేషన్‌ సాధనకు నిర్వహించే కార్యక్రమం ముందస్తు ఏర్పాట్ల కోసం కవిత ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే.. కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించే పక్షంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది వేచి చూడాలి.

Exit mobile version