Single voter | అరుణాచల్‌ కొండల్లో ఏకైక మహిళా ఓటర్.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు సిద్ధమైన ఎన్నికల సిబ్బంది..!

  • Publish Date - March 27, 2024 / 03:45 PM IST

Single voter : ప్రజాస్వామ్య పండుగ అయిన ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరూ కీలకమే. కాబట్టి్ ప్రతి ఓటరునూ ఎన్నికల్లో భాగస్వామిని చేసేందుకు ఎన్నికల సంఘం కృషి చేస్తున్నది. అందుకోసం మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచుతున్నది. ఏ ఒక్క ఓటరూ పోలింగ్‌కు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒక్క ఓటరు ఉన్నా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఈ క్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంతో దాదాపు 39 కి.మీ. దూరం ట్రెక్కింగ్‌ చేసి అక్కడికి చేరుకునేందుకు పోలింగ్‌ సిబ్బంది సిద్ధమయ్యారు.

లోక్‌సభ ఎన్నికలతోపాటే అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్‌ 19న జరగనున్నాయి. అక్కడి అంజావ్‌ జిల్లాలోని మాలెగావ్‌ అనే మారుమూల గ్రామం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. ఈ గ్రామం అరుణాచల్‌ ఈస్ట్‌ లోక్‌సభ, హుయులియాంగ్‌ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ వారంతా వేరే పోలింగ్‌ బూత్‌ పరిధిలోకి మారిపోయారు. సొకేలా తయాంగ్‌ (44) అనే మహిళ మాత్రం అందుకు నిరాకరించారు. దాంతో ఆమె కోసం తాత్కాలికంగా ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

అయితే ఎత్తైన పర్వతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే ఆ ప్రాంతాన్ని చేరుకునేందుకు నడక ఒక్కటే మార్గం. దాంతో పోలింగ్‌ సిబ్బందిని ట్రెక్కింగ్‌కు సిద్ధం చేశారు. 2014 ఎన్నికల సమయంలో మాలెగావ్‌ గ్రామంలో రెండు ఓట్లు ఉండేవి. ఒకటి తయాంగ్‌ ఓటు కాగా, మరొకటి ఆమె భర్తది. ఆ తర్వాత ఆయన అదే నియోజకవర్గంలో వేరే బూత్‌కు మార్పించుకున్నారు. అప్పటి నుంచి భర్త, భార్య విడిపోయారు. దాంతో 2019లో కూడా తయాంగ్‌ ఒక్కతే అక్కడ ఓటు వేశారు.

Latest News