Election Commissioners : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) లో ఖాళీ అయిన రెండు ఎలక్షన్ కమిషనర్ (Election Commissioners) పోస్టులను ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ భర్తీ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లోక్‌సభాపక్ష నేత హోదాలో సెలెక్ట్ కమిటీ సభ్యుల్లో ఒకరిగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి (Adhir Ranjan Chowdhury) ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ ప్రభుత్వాధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కొత్త ఎన్నికల కమిషనర్‌లుగా నియమించినట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఆ తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై జాబితాలోని రెండు పేర్లను ఫైనల్ చేసింది. ప్రధాని నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ సభ్యులుగా ఉన్నారు.
సెలెక్ట్ కమిటీ సమావేశం అనంతరం అధిర్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కమిటీలో ప్రభుత్వానికే మెజారిటీ ఉంది. తొలుత నాకు 212 పేర్లను పంపించారు. సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురి పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేశ్‌ను ఎంపిక చేశారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ సభ్యుడిగా ఉండాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, గత నెల కేంద్ర ఎన్నికల సంఘంలోని ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. దాంతో ఎన్నికల సంఘంలో ఉండే రెండు కమిషనర్ పోస్టులూ ఖాళీ అయ్యాయి. దాంతో ఇవాళ సెలెక్ట్ కమిటీ సమావేశమై నూతన ఎన్నికల కమిషనర్‌లను నియమించింది. ఇదిలావుంటే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్‌ల (ఈసీల) నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ని మినహాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం (మార్చి 15న) విచారణ చేయనుంది.