Elephant | విధాత: లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు.. రహదారి లేదా అటవీ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు చూడదగ్గ ప్రదేశాలు ఉంటే ఆగిపోతుంటాం.. ఆకర్షణీయంగా ఉంటే సెల్ఫీలకు ఫోజులిస్తుంటాం.. ఓ ఇద్దరు పర్యాటకులు కూడా అటవీ ప్రాంతంలో వెళ్తూ సెల్ఫీలు దిగారు. ఇక ఓ భారీ ఏనుగు కనిపించేసరికి దాని వద్ద కూడా సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.
ఆ భారీ ఏనుగు మాత్రం పర్యాటకులకు సహకరించలేదు. వారిని అక్కడ్నుంచి తరిమింది. ఆ పర్యాటకులకు సంబంధించిన కారు కూడా వేగంగా ముందుకు కదిలింది. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఏనుగు దాడి నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని బందీపూర్ నేషనల్ పార్కు అండ్ టైగర్ రిజర్వులో వెలుగు చూసింది. అయితే పర్యాటకులు కారులో కర్ణాటక నుంచి కేరళ వెళ్తున్నట్లు తెలిసింది. అటవీ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అడవి జంతువులకు ఆటంకం కలిగించినా, వాటి పట్ల అత్యుత్సాహం ప్రదర్శించిన ఇలాంటి ఘటనలే ఎదురవుతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.