పార్టీ మారుతున్నట్టు వస్తున్న వదంతులపై ఇదీ ఎర్రబెల్లి క్లారిటీ!

తాను పార్టీ మారడం లేదని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను బిజెపి లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు

  • Publish Date - March 19, 2024 / 09:28 AM IST

  • ప్రణీత్రావుతో నాకు సంబంధం లేదు
  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తాను పార్టీ మారడం లేదని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను బిజెపి లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు. నా పైన కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు హనుమకొండ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కేసీఆర్ సారధ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పని చేస్తాను.


వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని బలాహీనపర్చాలని ఇలాంటి దుష్ప్రచారం నాపైన చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేసే దుష్ప్రచారాలని నమ్మవద్దు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ బిజెపి తాను పార్టీ మారుతున్నట్లు ఒక రాయి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


గతంలో కూడా తనను పార్టీ మార్పించేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా ఒత్తిడి తెచ్చినప్పటికీ తాను లొంగిపోలేదని వివరించారు. తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వుగా మార్చినప్పటికీ తలోగ్గలేదని, పాలకుర్తికి వెళ్లి పోటీ చేసినట్లు వివరించారు. రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.


ప్రణీత్‌రావుతో నాకు సంబంధం లేదు


ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తిగా మారిన మాజీ డిఎస్పి ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆయన ఎవరో కూడా తనకు తెలియదని వివరించారు. పర్వతగిరి ప్రణీత్రావు అత్తగారు ఊరని తెలిసిందని వారి అత్తగారు తనకు తెలుసని చెప్పారు. ఎలాంటి విచారణ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని ఎర్రబెల్లి అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News