- కేసులు పెట్టేందుకు ప్రయత్నం
- పార్టీ మారేందుకు ఒత్తిడి
విధాత, హైదరాబాద్: దౌర్జన్యం చేశానంటూ నాపై ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఓ చీటర్ అని, తనపై కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, 40ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని, గతంలో కూడా కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకుని మీడియా వార్తలు రాయాలని సూచించారు. విజయ్ అనే వ్యక్తీ మా బంధువని వార్తలు రాస్తున్నారని, విజయ్ మాకు బంధువు కాదన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌లోని ప్రణిత్ రావు ఎవరో నాకు తెలియదన్నారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నాడని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్నారైలను కూడా కోట్ల రూపాయాలు మోసం చేశాడని, విజయవాడకు చెందిన విజయ్ అనే ఎన్నారై దగ్గర శరణ్ చౌదరి రూ.5 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. విజయ్ ఎవరో తనకు పరిచయం లేదని వెల్లడించారు. ఎన్నారైలు విజయ్‌ని తన దగ్గరికి తీసుకొచ్చారని, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించానని తెలిపారు.
శరణ్ చౌదరిపై అనేక చీటింగ్ కేసులు ఉన్నాయని, అతనితోపాటు ఆయన భార్య పాస్ పోర్ట్ కూడా పోలీసులు సీజ్ చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ విజయ్ పంపించిన వీడియోను మీడియాకు చూపించారు. తనకు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ అన్నారు. రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టాలని శరణ్ చౌదరి కోరాడని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమను మోసం చేశాడని చెప్పారు.
మా ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారని, ఎంత ఒత్తిడి తెచ్చిన నేను పార్టీ మారేది లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడీ, కేసులు పెట్టారన్నారు. కావాలని వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అప్పుడు ఎస్పీ రిజర్వర్డ్ చేశారని చెప్పారు. ఓటు నోటుకు కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రస్తుత నా వివరణ వార్త డైవర్ట్ అవుతదని, ఇప్పుడు నేను ఓటుకు నోటు కేసు పై స్పదించనని ఎర్రబెల్లి చెప్పారు.