వారిద్దరి పని నా గొంతు నొక్కడమే: ఈటల

నేను ఉద్యమ బిడ్డను, పేదల కోసం, ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి పని చేసే బిడ్డనని.. నా గొంతునొక్కేయాలని అప్పుడు కేసీఆర్ ప్రయత్నం చేశాడని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు

  • Publish Date - March 30, 2024 / 08:45 AM IST

కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలపై ఈటల ఫైర్‌

గెలిపిస్తే మోదీ అండతో అభివృద్ధి చేస్తా


విధాత, హైదరాబాద్‌ : నేను ఉద్యమ బిడ్డను, పేదల కోసం, ధర్మం కోసం అహర్నిశలు కష్టపడి పని చేసే బిడ్డనని.. నా గొంతునొక్కేయాలని అప్పుడు కేసీఆర్ ప్రయత్నం చేశాడని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. శనివారం మూసపేట్ 115 డివిజన్‌లో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకను గెలిపించండి అంటే మీరంతా రేవంత్ రెడ్డికి ఓట్లు వేశారని, కానీ రేవంత్ ఎన్నడూ రాలేదు, పట్టించుకోలేదన్నారు.


కానీ ఇప్పుడు వచ్చి నాది అంటున్నాడని, నీదే అయితే ఈ నియోజకవర్గం పరిధిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవలేక పోయారని ఈటల ప్రశ్నించారు. తనను గెలిపిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తానన్నారు. మీకు అందుబాటులో ఉండే…పిలిస్తే పలికే మీ బిడ్డనని, నాకు వేరే వ్యాపకం లేదని, 32 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో ఉంటున్న నన్ను ఆదరించాలని కోరారు.


రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయిస్తానని, పిల్లల ఉద్యోగాల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని, అన్నికంటే ముందు తలెత్తుకొని మా ఎంపీ అని చెప్పుకొనేలా పనిచేస్తా అని హామీ ఇస్తున్నానని చెప్పారు. తెలంగాణ కోసం కొట్లడిన బిడ్డనని, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా.. నేను చిన్నతనంలో పడిన బాధ ఇప్పటి పిల్లలు అనుభవించ వద్దు అని సన్నబియ్యం పథకం తెచ్చింది నేను అని గుర్తు చేశారు. కరోనా మంత్రిగా.. మొట్టమొదటి కరోనా పేషంట్ ను స్వయంగా వెళ్లి కలిసిన మొదటి మంత్రిని నేను అని, కష్టకాలంలో అండగా నిలబడ్డానని తెలిపారు.


ప్రధాని నరేంద్రమోదీ పేదవాళ్లకు కరోనా సమయం నుండి 5 కేజీల బియ్యం అందిస్తున్నారని, ఇంకా 5 ఏళ్లు ఇస్తమంటున్నారని, 2 లక్షల 50 వేల ఇళ్లు అర్బన్ హౌసింగ్ కింద తెలంగాణకు మంజూరు చేస్తే అవికూడా కేసీఆర్‌ కట్టలేకపోయాడని తెలిపారు. 1.75 లక్షల ఇళ్లు కట్టిన అని బోగస్ మాటలు చెబుతు 70 వేలు మాత్రమే పంచారని, కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వక దర్వాజాలు, కిటికీలు పీక్కు పోతున్నారన్నారు. మరోవైపు దేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం 4 కోట్ల ఇళ్లు కట్టించారని, 2 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు.


11వ‌ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ను 5వ స్థానంలో నిలిపారని, మళ్ళీ అధికారం ఇస్తే మూడవ స్థానానికి తీసుకు వస్తా అంటున్నారన్నారు. ఒకే దేశం ఒకే చట్టం అమలులోకి తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ అన్నారు. రామమందిరం నిర్మాణం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడినా అన్నిటిలో తెలంగాణ నంబర్ వన్ అని చెప్పారని, ఇప్పుడూ కాంగ్రెస్ చెబుతుంది బీఆరెస్‌ అప్పులో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసి వెళ్లారని ఈటల ఎద్దేవా చేశారు.


ఈ సమావేశంలో బీజేపీ నేతలు కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర రావు, కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, అసెంబ్లీ ప్రబారీ పాపయ్య గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, కంటెస్టెడ్ కార్పొరేటర్స్ కృష్ణగౌడ్, కంచి మహేందర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.

Latest News