ఉన్నమాట: దేశంలోని మిగతా రాష్ట్రాలకు నేడు దీపావళి వస్తోంది కానీ ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాలకు రెండు నెలల ముందే దీపావళి వచ్చింది.. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు కాకమీద ఉండడంతో నిత్యం మాటల టపాసులు పేలుతూనే ఉన్నాయి.
కొంతమంది నాయకులు లక్ష్మీబాంబుల్లా పెద్ద శబ్దం చేస్తుండగా కొందరు మాత్రం సీమ టపాకాయిల్లా చిన్నగా చప్పుడు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఏదో చేద్దాం అనుకుంటూనే వత్తి లేని బాంబులా తుస్సుమంటున్నారు. ఇంకొందరు అయితే థౌజండ్ వాలా మాదిరి కాసేపు సౌండ్ చేస్తున్నారు.
మొన్నామధ్య విశాఖలో ధూమ్ ధామ్ అంటూ భారీ సౌండ్ చేస్తూ దేదీప్యమానంగా తరాజువ్వలా వెలుగుతూ నింగిలోకి ఎగిసిన పవన్ కళ్యాణ్ జోరు మీద పొత్తు, కలిసి నడుద్దాం అన్న మాటలతో చంద్రబాబు నీళ్లు పోసేసారు. సొంతంగా ప్రమిద మాదిరి వెలుగుతారు అనుకున్న పవన్ కు ప్రమీదలో చమురు పోసేది చంద్రబాబు అనే విషయం తేటతెల్లమైంది.
ఇక పవన్ మీద నిత్యం కామెంట్లు చేసే అంబటి, రోజా వంటి సీమ టపాకాయలు ఆ రెండ్రోజులు చిటపటలాడి చల్లబడ్డాయ్. మొన్నామధ్య జగన్ కూడా మాట్లాడుతూ మళ్ళీ పవన్ మూడు పెళ్లిళ్ల పాయింట్ బయటికి తీసి వత్తి వెలిగించారు. తాము మూడు రాజధానులు అంటుంటే పవన్ మాత్రం మూడు పెళ్లిళ్లు అంటున్నారని వెక్కిరించారు. ఇలాంటి పేలని బాంబులను తాము లెక్క చేసేది లేదన్నారు.
ఇదిలా ఉండగానే మధ్యలోకి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దేవధర్ మాత్రం పవన్ అనే తారాజువ్వ తమదేనని, తమే వెలిగిస్తామని మున్ముందు టీడీపీ అనే పాము బిల్లాల జోలికి పోయేది లేదని స్పష్టం చేశారు.
ఈ బాంబుల మోతల మధ్యలో అమరావతి రైతులు వెలిగించిన భూచక్రమ్ అనే ర్యాలీని ప్రభుత్వం మధ్యలోనే పక్కకు నెట్టేసి దాని వెలుగులను ఆర్పేసింది. కోర్టు ఉత్తర్వులు చూపిస్తూ రైతుల ఆధార్ కార్డులు ఉన్నోల్లే ర్యాలీ.. పాదయాత్ర చేయాలి అన్న కండిషన్ పెట్టగానే భూచక్రం అనే పాదయాత్ర ఆరిపోయింది..ఓ వారం తరువాత మళ్ళీ వత్తి వేసి వెలిగిస్తాం అని ఉద్యమకారులు అంటున్నారు.
ఇక విశాఖలో ఇద్దరు ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, విజయసాయి మధ్య థౌజండ్ వాలాలు పేలుతూనే ఉన్నాయి. ఒకరి ఇంటి మీదకు ఒకరు అవినీతి తారాజువ్వలు విసురుతూ వారి రాజకీయ స్థావరాలను తగలబెట్టే యత్నాలు గట్టిగానే సాగాయి. ఈ జువ్వలు ఎగిరీఎగిరి మొత్తం పార్టీని తగలేసేలా ఉందన్న భయంతో అధిష్టానం అప్రమత్తమై మాటల పటాకుల మీద నీళ్లు చల్లింది.
టీడీపీ మాత్రం ఈసారి ఎలాగైనా జగన్ ను ఓడించి భారీగా దీపావళి చేసుకోవాలని ముందు నుంచే సాధన సంపత్తిని.. టపాసులను సిద్ధం చేస్తోంది.. జగన్ ఈసారి కూడా గెలవాలన్న తలంపుతో ప్రతియింటా సంక్షేమ దీపావళి వెలుగులు పంచుతూ ముందుకు సాగుతున్నారు.