Site icon vidhaatha

Fake Medicine | నకిలీ మందుల రాకెట్ గుట్టుర‌ట్టు

Fake Medicine | విధాత‌: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) బోగస్ మెడిసిన్ రాకెట్ గుట్టును ర‌ట్టుచేసింది. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు సూచించిన నకిలీ మందుగోలీల‌ను పెద్దమొత్తంలో సీజ్‌చేశారు. నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ద‌వాఖాన నుంచి యాంటీబయాటిక్ సిప్రోఫ్లోక్సాసిన్ అనే 21,600 టాబ్లెట్‌లను స్వాధీనం చేసుకున్నట్టు శనివారం ఒక అధికారి తెలిపారు. ఇలాంటి కేసులో ఇప్పటికే జైలులో ఉన్న థానే నివాసితో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసిట్టు పేర్కొన్నారు.


గత ఏడాది ప్రభుత్వ కాంట్రాక్ట్ ప్రక్రియ ద్వారా ఈ ఔషధాన్ని కొనుగోలు చేసినట్టు ఎఫ్‌డీఏ అధికారి తెలిపారు. మహారాష్ట్రలోని పలు ప్రభుత్వ ద‌వాఖాన‌ల‌కు కోట్లాది రూపాయల విలువైన సిప్రోఫ్లోక్సాసిన్ అనే నకిలీ మాత్రల‌ను బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి సూచించినట్టు వెల్లడించారు.


ఎఫ్‌డీఏ నాగ్‌పూర్‌కు 40 కిలోమీట‌ర్ల‌ దూరంలోని కల్మేశ్వర్ తహసీల్‌లోని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రం నుంచి గ‌త ఏడాది మార్చిలో ‘సిప్రోఫ్లోక్సాసిన్’ టాబ్లెట్ల‌ను ఎంపిక చేసి పరీక్ష కోసం ముంబైలోని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించిన‌ట్టు పోలీసు అధికారి తెలిపారు. 2023 డిసెంబర్ వచ్చిన పరీక్ష నివేదికలో సిప్రోఫ్లోక్సాసిన్ అనే మాత్రలకు ఎలాంటి ఔషధ విలువలు లేవని తేలిందని చెప్పారు.


నాగ్‌పూర్‌లోని ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ద‌వాఖాన ద్వారా టాబ్లెట్లు సరఫరా చేయబడినందున, ఎఫ్‌డీఏ అధికారులు ఇటీవల అక్కడ దుకాణంపై దాడి చేసి అదే బ్రాండ్‌కు చెందిన 21,600 టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ‘రిఫైన్డ్‌ ఫార్మా గుజరాత్‌’ అనే బోగస్‌ కంపెనీ ఈ డ్రగ్‌ను తయారు చేసిందని విచారణలో తేలింది. ప్ర‌స్తుతం ఆ కంపెనీ ఉనికిలో లేదు.


ఈ కేసుకు సంబంధించి థానేకు చెందిన విజయ్ శైలేంద్ర చౌదరి, లాతూర్ నివాసి హేమంత్ ధోండిబా ములే, థానే సమీపంలోని భివాండీకి చెందిన మిహిర్ త్రివేదిలపై కల్మేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు చౌదరి ఇప్పటికే బోగస్ మందుల విక్రయం కేసులో జైలులో ఉన్నాడు.

Exit mobile version