Site icon vidhaatha

FAME-II | విద్యుత్‌ వాహనాలపై ఇకపైనా రాయితీ.. ‘ఫేమ్‌-2’ స్కీమ్‌ను పొడిగించనున్న కేంద్రం..!

FAME-II: విద్యుత్‌ వాహనాల కొనుగోలుపై రాయితీ ఇకపై కూడా కొనసాగనుంది. ఎందుకంటే విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్‌-2 (FAME-II) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందుకోసం అదనంగా రూ.500 కోట్ల నిధులను కూడా కేటాయించినట్లు సమాచారం. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ‘ఫేమ్-2’ పథకం 2024 మార్చి 31తో ముగియనుంది.

ఈ క్రమంలో వాహన తయారీ పరిశ్రమ నుంచి స్కీమ్‌ను పొడిగించాలని డిమాండ్లు వస్తున్నాయి. విక్రయాలు క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పథకాన్ని తొలగించడం ప్రతికూలంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేమ్‌-2 (FAME-II) ను పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఫేమ్‌ (Faster Adoption and Manufacturing Electric Vehicles) పేరిట ఇప్పటికే రెండు ఫేజ్‌లలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ కొనుగోళ్లపై ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది.

ఇక ముందు ఫేమ్‌-3 (FAME-III) ని కూడా తీసుకొచ్చే యోచనలో సర్కారు ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు పంపింది. ఫేమ్‌-3 కోసం రూ.12,600 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కేంద్రం ఫేమ్‌-2 ను పొడిగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఫేమ్‌-2 ను పొడిగిస్తే ఫేమ్‌-3కి సార్వత్రిక ఎన్నికల తర్వాతనే ఆమోదం లభించే అవకాశం ఉంది. ఫేమ్‌-3ని రెండేళ్ల వ్యవధితో తీసుకొచ్చే ఛాన్స్‌ ఉంది. విద్యుత్తు ట్రక్కులు, ట్రాక్టర్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్‌ వాహనాలకు ఫేమ్ స్కీమ్‌ కింది రాయితీలు ఇవ్వనున్నారు.

కాగా, ‘వాహన్‌’ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. 2024 ఫిబ్రవరిలో విద్యుత్‌ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 24 శాతం పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 66,053 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి అవి 81,963 యూనిట్లకు పెరిగాయి. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయి.

Exit mobile version