Site icon vidhaatha

RRR | భూ సర్వేను అడ్డుకున్న రైతులు.. అధికారుల తరిమివేత

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక, చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామాల సమీపాన RRR రోడ్డు సర్వేకి వచ్చిన అధికారులను భూములు కోల్పోతున్న రైతులు సమిష్టిగా అడ్డగించి వెనక్కి పంపించారు. రైతుల ప్రతినిధి తంగళ్లపల్లి రవికుమార్ (Tangallapalli Ravikumar), సీపీఎం వలిగొండ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి (Siripangi Swami)ల ఆధ్వర్యంలో అధికారులను అడ్డుకొని అక్కడి నుండి వెళ్లగొట్టారు. సర్వే చేస్తున్న చౌటుప్పల్ ఆర్ఐ సుధాకర్ రావు (RI Sudhakar Rao)ను, సర్వేయర్ మురళి (Murali) లను తరిమేశారు.

గుట్టు చప్పుడు కాకుండా దొంగల్లాగా తమ భూములలో తమకు తెలియకుండానే అడుగు పెట్టడానికి మీరేవంటు అధికారులను రైతులు ప్రశ్నించారు. దీనితో కాసేపు రైతులకు, అధికారులకు భారీ ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. సంఘటనలో సర్వేకు వచ్చిన అధికారుల వాహనాలకు కూడా రైతులు నిప్పంటించే ప్రయత్నం చేశారు. రైతుల ఆగ్రహానికి తలొగ్గిన అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా రైతులు సీఎం కేసీఆర్ (CM KCR) కు, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్న, సన్న కారు రైతుల భూములను కబళించే రీతిలో, పెట్టుబడిదారీ, కార్పొరేట్ దారుల భూములకు మేలు చేసే రీతిలో రూపొందించిన రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. మా భూముల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతం కానీ తమ భూములను మాత్రం ఇవ్వబోమని మీడియాతో రైతులు తమ గోడును ఏకరువు పెట్టారు.

Exit mobile version