- శరవేగంగా మూసీ 36 డిస్ట్రిబ్యూటర్ కాలువ మరమ్మతు పనులు
- ధన్యవాదాలు తెలిపిన రైతులు
విధాత: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి చొరవతో మూసీ ఆయకట్టులో ఎండిపోతున్న వందల ఎకరాల పంట పొలాలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. మూసీ ప్రధాన కాలువ సింగిరెడ్డి పాలెం – తాళ్ల ఖమ్మం పహడ్ గ్రామ రైతుల భూములకు వెళ్లే 36వ డిస్ట్రిబ్యూటరీకి సంబందించిన కాలువ పరిధిలోని మైనర్ కాలువ మరమ్మతులు మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలతో 24 గంటల్లో పూర్తయి సాగునీటి కొరతతో ఎండిపోతున్న ఆయకట్టు పంటలకు నీటి సరఫరా పునరుద్ధరించబడింది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లి విరిసింది.
పంచాయితీ రాజ్ శాఖ అధ్వర్యంలో కాలువపై రహదారిని నిర్మించే సమయంలో కాలువ గూనల పైప్‌ల లెవెల్‌ను గుత్తేదారులు సరిచూసుకోలేదు. దీంతో ప్రధాన కాలువ నుండి మైనర్ కాలువకు నీటి ప్రవాహం సాగకపోవడంతో సింగిరెడ్డి పాలెం, తాళ్ల ఖమ్మం పహాడ్ గ్రామాల రైతులకు చెందిన వందలాది ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
రైతులు వాట్సప్‌లో తమ సమస్యను రెండు రోజల క్రితం మంత్రి జగదీష్ రెడ్డికి విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి ఈ సమస్యకు కారణమైన పంచాయతీ, ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 24 గంటల్లో మూసీ కాలువ నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో కదిలిన ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు 24 గంటల లోపు కాలువకు మరమ్మతులు చేసి నీరు ప్రవహించే విధంగా కాలువను పునరుద్ధరించారు. దీంతో మరో రెండు రోజుల్లో ఎండి పోయే స్థితిలోకి వెళ్లిన పంటలు ప్రాణం పోసుకున్నాయి.
ఇక రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి జగదీష్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రైతు బిడ్డగా మాకు అండగా నిలిచిన రైతు బాంధవుడు జగదీష్ రెడ్డి అని కొనియాడారు. ఫోన్‌లో సమస్యను తెలిపితే వెంటనే స్పందించి వందలాది మంది రైతుల ఇళ్లలో ఆనందం నింపిన మంత్రికి జీవితాంతం అండగా ఉంటామన్నారు.