Site icon vidhaatha

ఢిల్లీకి మళ్లీ రైతుల పోరుయాత్ర.. అడ్డుకుంటే ఆపిన చోటే ఆందోళన

న్యూఢిల్లీ: ఏడాదిపాటు అలుపెరుగని పోరాటం చేసి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయించిన రైతులు.. తమ ప్రధాన డిమాండ్‌ అయిన కనీస మద్దతు ధర చట్టం విషయంలో మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. 13-02-2024న దేశ రాజధానిలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 12వ తేదీన అంబాలాలోని శంభు సరిహద్దు నుంచి యాత్ర మొదలు పెట్టనున్న రైతులు.. తమను ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయించి.. ఆందోళనకు దిగుతామని స్పష్టం చేస్తున్నారు.


ఈ విడుత ఆందోళనలో సుమారు 70 వేల నుంచి 80 వేల మంది రైతులను సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఢిల్లీకి ర్యాలీ తర్వాత మూడు రోజులకు అంటే.. 16-02-2024న గ్రామీణ భారత్‌ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు సీపీఎం అనుబంధ రైతు సంఘమైన అఖిల భారత కిసాన్‌ సభ నేతృత్వంలోని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. పంటలకు కనీస మద్దతు ధరపై ఇచ్చిన హామీని ప్రధాని మోదీకి గుర్తు చేసేందుకు పంజాబ్‌, హర్యానా నుంచి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లలో బయల్దేరేందుకు రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు.


ఏడాదిపాటు మడమ తిప్పని పోరు


మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో 2020 నవంబర్‌ నుంచి 2021 డిసెంబర్‌ వరకూ రైతులు అద్భుతమైన పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ పోరాటంతో నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్లలో మొట్టమొదటిసారి దిగి వచ్చి.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నది. ఆ సమయంలో కనీస మద్దతు ధరపై చట్టం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. రెండేళ్లు గడిచిపోయినా.. లోక్‌సభకు మళ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నా.. మోదీ సర్కారు ఈ అంశంపై పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఇప్పటికే అనేకమార్లు ఆందోళన చేసిన రైతులు.. ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.


ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పిస్తామన్న హామీతోనే 2021 డిసెంబర్‌లో తమ ఆందోళన ఉపసంహరించామని రైతు సంఘాలు చెబుతున్నాయి. కానీ.. ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నాయి. ఇటీవల మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. కనీస మద్దతు ధరలను కాలానుగుణంగా పెంచుతామని ప్రకటించారు. అయితే.. ఇంత వరకూ ఎమ్మెస్పీకి చట్టబద్ధత లేదని, ఇది తమ ప్రాథమిక డిమాండ్‌ అని రైతు సంఘం నేత రమణ్‌దీప్‌ సింగ్‌ మాన్‌ చెప్పారు.


అయినకాడికి అమ్ముకోవాల్సిందే


గత ఏడాది మే-జూన్‌ మాసాల్లో హర్యానాలో పొద్దుతిరుగుడు పువ్వు ఉత్పత్తిదారులు కనీస మద్దతు ధర అమలు కావడం లేదంటూ ఢిల్లీ-అమృత్‌సర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ‘ప్రభుత్వం పొద్దుతిరుగుడుకు రూ.6,400 మద్దతు ధర ప్రకటిస్తే.. రైతులకు మాత్రం రూ.5,800 మించి దక్కలేదని, అది కూడా తాము ఆందోళనకు దిగిన తర్వాతే ఆ రేటు ఇచ్చారని అంబాలాకు చెందిన రైతు గుర్జీత్‌సింగ్‌ వాపోయారు. తదుపరి సీజన్‌కు కనీస మద్దతు ధర రూ.5,600గా నిర్ణయించడంతో రైతులెవరూ పొద్దుతిరుగుడు వేయలేదని ఆయన తెలిపారు.


మొక్క జొన్నలకు కూడా ఎమ్మెస్పీ ప్రకటించినా.. ప్రభుత్వం సేకరించడం లేదని, వ్యాపారులు, దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌ కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా కొద్ది నెలలుగా పని చేస్తున్నదని ఆలిండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజో కృష్ణన్‌ తెలిపారు. గ్రామీణ బంద్‌ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.


ఫిబ్రవరి 12న ఢిల్లీకి యాత్ర మొదలు


ఫిబ్రవరి 12న అంబాలాలోని శంభు సరిహద్దు వద్దకు పంజాబ్‌, హర్యానా రైతులు చేరుకుని మరుసటి రోజు ఢిల్లీకి ట్రాక్టర్లతో బయల్దేరుతారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (షహీద్‌ భగత్‌సింగ్‌) అధ్యక్షుడు అమర్జీత్‌ సింగ్‌ మోర్హి చెప్పారు. ఒకవేళ తమను ఎక్కడ అడ్డుకుంటే అక్కడే ఆగిపోతామని, తమ డిమాండ్లను కేంద్రం పరిష్కరించే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. తదుపరి విడుత ఆందోళన కోసం 70వేల నుంచి 80 వేల మంది రైతులను సమీకరించేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు.

Exit mobile version