Site icon vidhaatha

వరంగల్‌లో.. రాష్ట్రంలోనే తొలి మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ప్రారంభం

పోలీసులంటే సహజంగానే సమాజంలో చాలామందికి గిట్టదు. వారిపట్ల సదాభిప్రాయం కనిపించదు. పోలీస్ స్టేషన్ (police station) కు పోవడం అంటేనే తప్పు చేయడం అనే అభిప్రాయం బలంగా వేళ్ళూనుకున్న ప్రస్తుత స్థితిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ (Friendly policing) అమలు చేయడం సాహసం అనే చెప్పవచ్చు. దీనికి అదనంగా పోలీస్ స్టేషన్‌లోనే మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ (Mother and child friendly room) ఏర్పాటు చేయడం విశేషం. అది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మానుకోట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం విశేషం.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలోనే తొలిసారి మానుకోట జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్‌ను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Sathyavathi rathode)ప్రారంభించారు. శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఈ రూమును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన జిల్లా ఎస్పీ(Sp)శరత్ చంద్ర పవార్‌ను అభినందించారు.

ఫిర్యాదులు చేయడానికి, దోషులను కలవడానికి, పోలీస్ స్టేషన్ కు చిన్నారులతో వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఈ ప్రత్యేక రూమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలకు పోలీస్ స్టేషన్ అనే భావన కలగకుండా ఆడుకోవడానికి, చిన్నారులు నిద్రించడానికి ఈ ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.

పోలీసులు, తల్లి పిల్లల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు ఈ రూము ( room) ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల (Law and order)పరిరక్షణ, మహిళల రక్షణ, నేర విచారణ, నేరస్థులకు శిక్షలు పడేలా చేయడంలో అగ్రభాగంలో తెలంగాణ పొలీస్ విభాగం ముందుందని కొనియాడారు.

ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు మంత్రి తెలియజేశారు. కార్యక్రమంలో మానుకోట ఎంపీ (MP)మాలోత్ కవిత (Kavitha), ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version