Fisheries Hub
- ఉమ్మడి జిల్లాలో శిక్షణ సంస్థ ఏర్పాటుకు ఆలోచన
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిషరీస్ విద్యా సంస్థ
విధాత బ్యూరో, కరీంనగర్: విస్తారమైన జలవనరుల సౌకర్యం కలిగి ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ అవకాశాలు ఉన్నాయని, ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. అందుకు అనుగుణంగా ఫిషరీస్ ఫెడరేషన్ సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.
ఆదివారం సాయంత్రం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో కరీంనగర్ దేశంలోనే మత్స్య రంగంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతుందన్నారు. ఈ జిల్లాలో మత్స్య ఉత్పత్తులకు సంబంధించిన శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిషరీస్ విద్యాసంస్థ నిర్వహించడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1000కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి, మధ్య మానేరు, లోయర్ మానేరు, తదితర జలాశయాలతో పాటు కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, 122 కిలోమీటర్ల పొడవైన వరద కాలువ, వేలాది చెరువులు, కుంటలు, మానేరు ఉపనదిపై నిర్మించిన అనేక చెక్ డ్యాములు జిల్లాలో మత్స్య సంపదతో పాటు, ఆక్వా కల్చర్ రంగం అభివృద్ధికి అనుకూలంగా
మారాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలవనరుల్లో జరిగే చేపల ఉత్పత్తి రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న కారణంగా, ఉపరితల జల వనరులలో చేపల ఉత్పత్తికి అంతకంతకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు.
సమైక్య రాష్ట్రంలో ఉపరితల జల వనరుల విస్తీర్ణంలో దేశంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు.
దీంతో మత్స్య రంగం అభివృద్ధికి అవకాశాలు విస్తృతంగా పెరిగాయి అన్నారు. తెలంగాణలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మత్స్య రంగాన్ని ఆధునిక విధానాలతో మేళవించి, ఆక్వా కల్చర్ తో అనుసంధానం చేయడం ద్వారా చేపల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచేందుకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ఆధునిక పద్ధతులలో చేపలను పెంచేందుకు వీలున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మత్స్య రంగానికి అనుబంధంగా చేప పిల్లల ఉత్పత్తి, చేపల దాణా, ప్రాసెసింగ్, వాల్యూ ఆడిషన్ తదితర అనుబంధ రంగాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయని తెలిపారు. ఈ రంగం అభివృద్ధి మహిళ సాధికారికతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు.
చేపల పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు, చేపల ఆహార పదార్థాలను దేశీయంగా మార్కెట్ చేయడం, విదేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాలు కలుగుతాయి అన్నారు. ఎందుకోసం ఫిషరీస్ ఫెడరేషన్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని రవీందర్ తెలిపారు.