విధాత: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు వెల్లడించింది. యూఏపీఏ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల విజ్ఞప్తితోనే నిషేధం విధించినట్లు సమాచారం.
మూడు రాష్ట్రాల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిషేధంపై హోంమంత్రికి సిఫార్సు చేశారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పీఎఫ్ఐ పై నిషేధంతో సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలకు మార్గం సుగమం అయ్యింది.
పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కొన్ని రోజులుగా దాడులు జరుపుతోన్న సంగతి తెలిసిందే.
పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతున్నది. చంచల్‌గూడ జైలులో నలుగురు నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నలుగురు నిందితులైన రెహమాన్, వహీద్, జాఫరుల్లా, వారిస్‌లను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు.
30 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఎన్ఐఏ పిటిషన్ వేసింది. మూడు రోజుల కస్టడీకి ఎన్ఐఏ కోర్టు అనుమతిచ్చింది. పీఎఫ్ఐ నిషేధం వేళ దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసింది. పీఎఫ్ఐ, అనుబంధ కార్యాలయాల వద్ద పోలీస్ భద్రత ఏర్పాటు చేసి ఆందోళనలు చేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.