Site icon vidhaatha

Subbarao | మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా.. పేద దేశమే

140 కోట్ల మంది ఉన్నందునే మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ
తలసరి ఆదాయంలో 139వ స్థానంలో భారత్‌
రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ డీ సుబ్బారావు

న్యూఢిల్లీ : 2029 నాటికి ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని సంబరపడటంలో అర్థం ఏమీ లేదని ఆర్థిక నిపుణులు తేల్చేస్తున్నారు. భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తానని ప్రధాని మోదీ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో డొల్లతనాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ డీ సుబ్బారావు వెల్లడించారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ భారతదేశం పేద దేశంగానే ఉండిపోతుందని చెప్పారు.

ధనిక దేశం కావాలంటే అభివృద్ధి చెందిన దేశమే అయి ఉండనక్కర్లేదన్న సుబ్బారావు.. అందుకు ఉదాహరణగా సౌదీ అరేబియాను చూపారు. ‘నా దృష్టిలో అది (మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ) సాధ్యమే. కానీ.. అందులో సంబరపడాల్సింది ఏమీ లేదు. ఎందుకు? మనదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నందునే మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రజలే ఉత్పత్తికి కారకులు. మన వద్ద జనాభా ఉన్నది కాబట్టి మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ.

కానీ.. మనది ఇంకా పేద దేశమే’ అని సుబ్బారావు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం భారత జీడీపీ 3.7 ట్రిలియన్‌ డాలర్లుగా కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2,16,877 రూపాయల తలసరి ఆదాయంతో ప్రపంచ దేశాల జాబితాలో 139వ స్థానంలో ఉన్నది. బ్రిక్‌ దేశాలతో పోల్చినా, జీ-20 దేశాలతో పోల్చినా భారత్‌ అత్యంత పేద దేశమని సుబ్బారావు తెలిపారు. ముందుకు వెళ్లేందుకు అజెండా స్పష్టంగా ఉన్నదన్న ఆర్బీఐ మాజీ గవర్నర్‌.. వృద్ధి రేటును వేగవంతం చేసి, దాని ప్రయోజనాలను అందరికీ పంచడమేనని అన్నారు.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చుతామని ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న అంశాలను ప్రస్తావించిన సుబ్బారావు.. దానిని సాధించాలంటే నాలుగు కీలక అంశాలు.. చట్టబద్ధమైన పాలన, బలమైన దేశం, జవాబుదారీతనం, స్వతంత్ర సంస్థలు.. అవసరమని నొక్కి చెప్పారు.

Exit mobile version