హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అదే బాటలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి వెళ్లారు.
డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదంటూ వారు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పార్టీ అనుసరిస్తున్న విధానాలు తీవ్రంగా బాధిస్తున్నాయి. గుండెలనిండా గులాబీ జెండాతో, ఉద్యమ స్ఫూర్తే ఊపిరిగా 24 ఏండ్లుగా పార్టీ కోసం సైనికుడిగా పని చేశాను. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాను. కానీ పార్టీలో ఉద్యమకారులకు మనుగడ కరువైంది. కష్టనష్టాల సమయంలో మీతో ఉన్న మాలాంటి ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు తాము రాజీనామా చేస్తున్నామని మోతె శోభన్ రెడ్డి, ఆయన భార్య, డిప్యూటీ మేయర్ శ్రీలత పేర్కొన్నారు.