Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు ఖర్గేకు లేఖ ద్వారా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మాదిగలు అండగా నిలిచారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 2011జనాభా లెక్కల మేరకు 32.33లక్షల మంది ఉన్నారని. ప్రస్తుతం మరో 15లక్షల మంది మాదిగల జనాభా పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటు వస్తున్న మాదిగలకు లోక్ సభ ఎన్నికల్లో జనరల్, రిజర్వ్ స్థానాల్లో ఎక్కడా కూడా ఒక్క సీటు కేటాయించలేదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అవకాశం ఇవ్వలేదన్నారు. కేబినెట్ లో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మా గళాన్ని బలంగా వినిపించగలుతామని..సామాజిక సమీకరణల సమతుల్యతను అనుసరించి మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని వారు ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఏప్రిల్ 3వ తేదీ మూహుర్తంగా ఖరారైందన్న ప్రచారం నేపథ్యంలో ఆశావహులు మంత్రి పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణలు..గతంలో ఇచ్చిన హామీలు, రాజకీయ అవసరాల కోణంలో ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లతో చర్చలు పూర్తి చేసింది. అయితే మాదిగలు, లంబాడీలు, మైనార్టీలకు విస్తరణలో కూడా మంత్రి పదవుల సర్థుబాటు కష్టమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మాదిగలకు కేబినెట్ ప్రాతినిధ్యం కోరుతూ ఖర్గేకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మాకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలి : లంబాడీ ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో 32 లక్షల జనాభా ఉన్న లంబాడీలకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలంటూ ఎస్టీ కోటాలోని లంబాడీ సామాజిక వర్డం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు, రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడి సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ కు అండగా నిలిచిందని లేఖలో ఎమ్మెల్యేలు గుర్తు చేశఆరు. మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో వారు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు.