Janasena | జనసేన గాజు గ్లాసుకు బకెట్ సింబల్‌ సవాల్‌

  • Publish Date - April 10, 2024 / 02:18 PM IST

పరేషాన్‌లో జనసేన పార్టీ

విధాత : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి నవరంగ్‌ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గట్టి సవాల్‌గా తయారైంది. ఇప్పటికే జనసేన ఎన్నికల చిహ్నం గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్‌గా మార్చడంతో జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల వారికి గాజు గ్లాస్ గుర్తు దక్కనుంది. గాజు గ్లాసును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలంటూ జనసేన ఎన్నికల సంఘం వద్ధ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగానే.. ఇంకోవైపు నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చిహ్నం బకెట్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది.

నవరంగ్ నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సింబల్ బకెట్ జనసేన గాజు గ్లాసు గుర్తును పోలి ఉండటం జనసేనను కలవరపెడుతుంది. ఓటర్లు ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు వంటి వారు గాజు గ్లాసు, బకెట్‌ల మధ్య తేడా గమనించని పక్షంలో ఓట్ల పరంగా జనసేనకు నష్టం జరుగనుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఈ వివాదంలో మా పార్టీని పోటీ నుంచి తప్పుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ 5కోట్లు ఆఫర్ చేశారని, వినకపోవడంతో తనను పవన్‌, నాదెండ్ల మనోహర్‌, ఎంపీ బాలశౌరీలు బెదిరించారని ఈసీకి ఫిర్యాదు చేశారు.

జలీల్ ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికి గాజు గ్లాసు గుర్తును పోలీ ఉన్న బకెట్‌తో జనసేనకు నష్టం వాటిల్లవచ్చన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో 175స్థానాల్లో ఆ పార్టీల అభ్యర్థులను పోటీ పెడుతున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో జనసేనకు పడాల్సిన ఓట్లు పొరపాటున బకెట్ సింబల్‌పై వేస్తే గణనీయ స్థాయిలో ఓట్లకు గండి పడి ఎన్నికల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళన జన సేన నేతల్లో వినిపిస్తుంది.

Latest News