Site icon vidhaatha

Lucknavaram Lake | గోదావరి జలాలను లక్నవరం సరస్సుకు తరలించాలి: MLA సీతక్క

Lucknavaram Lake

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గోదావరి జలాలను లక్నవరం సరస్సుకు తరలించాలని ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క అన్నారు. లక్నవరం సరస్సును శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ లక్నవరం సరస్సు చాలా అందమైన సరస్సు అని, చుట్టూ కొండలతో నిండైన జలాశయంతో అత్యంత రమణీయంగా ఉంటుందన్నారు. అందుకే సందర్శకులను నిత్యం ఆకట్టుకుంటూ ఎప్పుడూ సందడి, సందడిగా ఆకర్షణీయంగా ఉండే లక్నవరం సరస్సు ఈరోజున వెలవెలబోతు పూర్తిగా ఎండిపోయి, జలం లేక దారుణమైన స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్నవరం సరస్సు కింద సుమారుగా 7000 ఎకరాల పంటకు సాగు నీరు అందిస్తున్నది అని, అలాంటి సరస్సు ఇవ్వాళ వెలవెల పోవడం గమనార్హం అన్నారు. గత కొన్నేండ్ల నుండి లక్నవరం సరస్సు జలాశయంలో నీళ్ళులేక ఎండిపోయిన స్థితి ఎప్పుడూ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరస్సుల కోసం మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చినా లక్నవరం సరస్సుకు ఎటువంటి లాభం జరగలేదని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎన్నో వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్న పాకాల, రామప్ప, ఇంచిచెర్వుపల్లి, ఘనపురం, మల్లూరు, లక్నవరం సరస్సులకు గోదావరి జలాలను తరలించి రైతులను ఆదుకోవాలని కోరారు. పర్యాటకుల కోసం ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఆకట్టుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో జాతీయ ఎల్.డి.ఎం.ఆర్గనైజింగ్ కార్యదర్శి డా.అనిల్ కుమార్, మహాబాద్ పార్లమెంటు కో- ఆర్డినేటర్ మార్క విజయ్, టీపీసీసీ కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version