Telangana | తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల వేళ పోడు భూముల రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. జూన్ 24 నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పోడు భూముల పట్టాలు అందుకున్న వారందరికీ రైతుబంధు వర్తింపజేస్తామని ప్రకటించారు.
ఆ రైతులకు ప్రభుత్వమే బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి, ఆ అకౌంట్లో నేరుగా రైతుబంధు నగదు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ అధికారులకు అందజేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్ణయం పట్ల పోడు భూముల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.